డెంటిస్ట్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసును హైదరాబాద్ పోలీసులు చేధించారు. డాక్టర్‌కు దగ్గరి బంధువుగా ఉన్న ముస్తఫానే ప్రధాన నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాతో తెలిపారు.
డెంటిస్ట్ హుస్సేన్‌కు ముస్తఫా దగ్గరి బంధువు. ముస్తఫా ఆస్ట్రేలియాలో ఉండేవాడు. ఖలీద్ అనే వ్యక్తి డాక్టర్ హుస్సేన్ ఇంటిపైనే అద్దెకు ఉండేవాడు. ముస్తఫా, ఖలీద్‌లపై ఆస్ట్రేలియాలో పలు కేసులు నమోదై ఉన్నాయి. ఆస్ట్రేలియాలో పలు బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో ముస్తఫా ఖలీద్ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డారు. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే వారి వ్యాపారంలో పూర్తిగా నష్టం రావడంతో అక్రమంగా డబ్బులు సంపాధించాలని నిర్ణయించుకున్నారు.
బురఖా ధరించి..
ఈక్రమంలోనే తన దగ్గర బంధువు అయిన డెంటిస్ట్ హుస్సెన్ ను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. కిడ్నాప్ స్కెచ్‌కు రెండు టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. సుమిత్, అక్షయ్, విక్కీ, సల్మాన్‌లు క్లినిక్‌లో ఉన్న హుస్సేన్‌ను బురఖా ధరించి దాడి చేసి కిడ్నాప్ చేశారు. క్లినిక్ నుండి కిడ్నాప్ చేసిన డాక్టర్‌ను కూకట్‌పల్లికి తరలించారు. కూకట్‌పల్లి నుండి బెంగుళూరుకు డాక్టర్‌ను తరలించేందుకు మరో టీమ్‌ను నిందితులు రెడీ చేసుకున్నారు. డాక్టర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 48 గంటలలోపు రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు మొత్తం 12 టీమ్‌లు రంగంలోకి దిగి కేవలం 12 గంటల్లోనే సెన్సేషనల్ కిడ్నాప్ కేసును ట్రేస్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాతో తెలిపారు. ఈ కేసు విషయంలో ఏపీ పోలీసులు మంచి సహకారాన్ని అందించారని సీపీ తెలిపారు.
పది నిమిషాల్లో ప్రాణం పోయేది..
తనను కిడ్నాప్ చేసిన విషయంపై బాధితుడు డాక్టర్ హుస్సేన్ మాట్లాడారు. నిన్న మధ్యాహ్నం నా క్లీనిక్ దగ్గరికి ముస్తఫా కారు వచ్చి సడెన్‌గా వెళ్లిపోయింది. ఆ తరువాత కొద్ది సేపటికే నా క్లీనిక్ లోపలికి కొంతమంది వచ్చారు. నాపై దాడి చేసి నన్ను కిడ్నాప్ చేశారు. ముస్తఫా నాతో చాలా మర్యాదాగా ప్రవర్తించేవాడు. ఎక్కడా కూడా నాకు అనుమానం రాలేదు. పది నిమిషాలు గడిస్తే నన్ను చంపేసి ఉండేవారు. నేను ఇక చనిపోతాను అనుకున్నానని అని హుస్సేన్ తెలిపారు. పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.