ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయా..?? త్వరలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..? రాజకీయ సమీకరణాలు అమాంతం చేంజ్ అవనున్నాయా.?? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. ముఖ్యంగా ముంబైలో రెండు వారాల షూట్ కోసం వెళ్లిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సడెన్ గా హైదరాబాద్ లో ఎంట్రీ ఇచ్చారు…
హైదరాబాద్ లో అడుగుపెడితే అది న్యూస్ కాదు.. కానీ, హుటాహుటిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు.. ఆయన నివాసానికి వెళ్లి మరీ చంద్రబాబుతో మంతనాలు జరిపారు.. మీడియాకి ఎలాంటి లీకులు ఇవ్వకుండా, డైరెక్ట్ గా బాబు గారి ఇంటి నుండి ఫోటోలు వరకు రిలీజ్ చేశారు.. ఇది ఊహించని పరిణామంగా భావిస్తున్నారు వైసీపీ నేతలు… రీసెంట్ గా పవన్ కల్యాణ్.. ఓ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లారు.. అక్కడే ఆయన కొన్ని రోజుల పాటు మకాం వేస్తారని ప్రచారం జరిగింది.. అయితే, ఉరుములేని మెరుపులా చంద్రబాబు నాయుడి ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు పవన్..
జనసేనాని.. చంద్రబాబుతో భేటీ అంతరార్ధం ఏమిటనే దానిపై వైసీపీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. పొత్తుల కోసం అయితే ఇంత ఆకస్మికంగా హైదరాబాద్ రావాల్సిన పనిలేదని భావిస్తున్నాయి తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు. ఢిల్లీ నుండి అందిన సంకేతాలతోనే పవన్.. బాబు గారి ఇంట వాలిపోయారనే అంచనాలు వేసుకుంటున్నారు..
రేపో మాపో కడప ఎంపీ, జగన్ సోదరుడు వైఎస్ అవినాష్.. బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్ట్ అవడం ఖాయమని, ఆ తర్వాత పరిణామాలు మరింత వేగంగా మారిపోతాయని రాజకీయ వర్గాలలో చర్చ మొదలయింది.. సీబీఐ అక్కడితో ఆగకుండా వైసీపీలోని కొందరు కీలక పెద్దలకు సైతం విచారణ పేరుతో నోటీసులు అందజేయడం ఖాయమని, దానికంటే ముందే బాబు – పవన్ భేటీ ఆవశ్యకం అని ఢిల్లీ వర్గాలు అంచనా వేశాయని, అందుకే, ఆ ఇద్దరి సమావేశం అని హస్తిన వర్గాల నుండి అందుతోన్న టాక్..
ఇటీవల ఢిల్లీ వర్గాలు.. ఏపీ సీఎం జగన్ ని దూరం పెడుతున్నాయని, ఇక్కడి నుండి అందుతోన్న రిపోర్టులతో ఆయనకు విరామం ఇవ్వడమే బెటర్ అనే అంచనాకు వచ్చారని హస్తినలో ప్రచారం జరుగుతోంది.. రీసెంట్ గా టైమ్స్ నౌ చానెల్ లో వైసీపీకి 24-25 ఎంపీ స్థానాలు రావడం ఖాయమని ఓ సర్వే విడుదలయింది.. ఇది వైసీపీ పెయిడ్ సర్వే అనే కథనాలు వెలువడ్డాయి.. ఇదే టైమ్ లో బీజేపీ మౌత్ పీస్ గా భావించే అర్నాబ్ గోస్వామి చానెల్ లో చంద్రబాబుని ప్రత్యేక గెస్ట్ గా పిలిచి ఓ భారీ డిబేట్ చేశారు.. ఇదంతా ఢిల్లీ వర్గాల నుండి అందిన లీకుల ప్రకారమే జరిగిందని, ఇటు తాడేపల్లి ప్యాలెస్ కి, హస్తిన నేతలకు పెరిగిన దూరానికి సంకేతాలని భావిస్తున్నారు.. మరోవైపు, టీడీపీతో స్నేహ హస్తం అందిస్తున్నారనే టాక్ మొదలయింది.. ఇదే ఇప్పుడు వైసీపీలో టెన్షన్ పెంచుతోంది.. ఆ పార్టీలో గుబులో రేపుతోంది..
మొత్తమ్మీద, చంద్రబాబు – పవన్ భేటీ ఎలాంటి హంగామా లేకుండా జరిగిందో, దానికి వ్యతిరేక దిశలో అనేక చర్చోపచర్చలకు తావిస్తోంది.. మరి, ఈ ప్రకంపనలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో చూడాలి.