కన్నడంలో సూపర్ హిట్టైన ‘లవ్ మ్యాక్ టైల్ ’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో తమన్నాతో రీమేక్ కూడా చేయబోతున్నారు. పైగా కన్నడంలో ఈ సినిమాకి సీక్వెల్ కూడా వస్తోంది. అంతవరకూ బాగానే ఉందిగానీ అందులో జంటగా నటించిన డార్లింగ్ కృష్ణ, మిలాన నాగరాజ్ మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యింది. పైగా ప్రేమికుల రోజున ఈ జంట ఒక్కటవడం మరో విశేషం. ఈ వార్త మాక్ టెయిల్ కన్నా కాక్ టెయిల్ మాదిరిగా కిక్ ఇస్తోంది కదూ. ఈ సినిమా చేసే సమయంలోనే వీరి మధ్య ప్రేమ అంకురించింది.
చివరికి బెంగళూరు శివారులోని ఓ ప్రైవేటు రిసార్టులో వీరి వివాహం జరిగింది. ఆ రిసార్టులోని కొలనులో పెళ్లి మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీనికి ఇద్దరి కుటుంబసభ్యులు, ఆదివారం తెల్లవారు జామున జరిగిన వివాహానికి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వివాహ వేడుకలో వధూవరులిద్దరూ సంతోష సంబరాల్లో మునిగితేలారు. అందమైన పట్టుచీరెలో మిలానా మిల మిల మెరిసిపోయింది. మెడ నిండా ఆభరణాలు ధరించింది. డార్లింగ్ కృష్ణ మాత్రం కుర్తా, దోవతి ధరించాడు.
ఇలా పెళ్లి చేసుకున్నప్పుడు అభిమానులకు ఏదైనా బహుమానం అందించాలనుకున్నారేమో తాము నటించిన ‘లవ్ మాక్ టెయిల్2’లోని ఓ పాటను ఈ సందర్భంగా విడుదల చేశారు. అంతకు రెండు ముందు నుంచే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బిజీ గా ఉన్నారు. మెహందీ కార్యక్రమంలో లవ్ మాక్ టెయిల్ సహనటులు కూడా పాల్గొన్నారు. కన్నడ నటి అమృతా అయ్యంగార్ కూడా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. లవ్ మాక్ టైల్ తెలుగు రీమేక్ లో వీరిద్దరూ పోషించిన పాత్రను సత్యదేవ్, తమన్నా పోషించబోతున్నారు. వీరికి ఈ సినిమా ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.
Must Read ;- వరుడు కావలెను నుంచి మెలోడీ లిరికల్ వీడియో