హిట్లు లేకపోయినా సచిన్ జోషి అంటే తెలుగులో చాలామందికి తెలుసు. ఎందుకంటే మొదటి నుంచీ అతనికి బిగ్ షాట్ అనే పేరుండేది. గోవా గుట్కా యజమాని గారాల పుత్రుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు ఉంది. ఈరోజు సచిన్ జోషి అరెస్టు వార్తతో చిత్ర పరిశ్రమలో మరోసారి ఈ పేరు చర్చనీయాంశమైంది.
సచిన్ జోషి తెలుగులో సినిమా షూటింగ్ కు వచ్చినప్పుడల్లా భారీ భద్రత ఉంటుంది. దాన్ని బట్టి అతను బిగ్ షాట్ అని అందరూ గుర్తించారు. అయితే వివాదాలు సచిన్ కు కొత్తేమీ కాదు. గతంలో ఓ నటి ఆత్మహత్యాయత్నం వెనక ఇతనే కారణం అనే టాక్ కూడా వినిపించింది. ఆ తర్వాత నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తో ఆర్థిక లావాదేవీల విషయమై గొడవ జరిగినట్టు కూడా సినిమా వర్గాలవారికి తెలుసు. ఇవికాక సచిన్ జోషిపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. గుట్కా అక్రమ రవాణా కేసులో అతని హస్తమున్నట్టు ఆరోపణలు రావడంతో హైదరాబాద్ పోలీసులు గత ఏడాది అతనిపై కేసు కూడా నమోదు చేశారు.
వాటినన్నిటినీ పక్కన పెడితే ఇప్పుడు మనీలాండరింగ్ వివాదం అతన్ని చుట్టుముట్టి అరెస్టుకు దారితీసింది. ఈడీ అధికారుల అదుపులో సచిన్ ఉన్నాడు. సచిన్ కు నటన మీద మక్కువ ఎక్కువ. డబ్బు సంపాదన కోసమైతే సినిమాల్లోకి రాలేదు. నటుడిగా తనకున్న కోరికను తీర్చుకోడానికి తెలుగు పరిశ్రమ అయితే బాగుంటుందన్న ఆలోచనతో ‘మౌనమేలనోయి’ చిత్రంతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత నినుచూడక నేనుండలేను, ఒరేయ్ పండు లాంటి చిత్రాలు చేశాక హిందీ చిత్ర పరిశ్రమ వైపు దృష్టి మళ్లింది. అక్కడ కొన్ని సినిమాలు చేశాడు. అలా తమిళంలోకి కూడా అడుగుపెట్టాడు.
హీరోగా, నిర్మాతగా చేతి చమురు వదిలినా అతని తండ్రి సంపాదించిన ఆస్తులతో పోలిస్తే ఇది వెంట్రుకతో సమానం. అందుకే ఆడుతూ పాడుతూ సినిమాలు చేసేస్తుంటాడు. అతను సినిమాలు చేస్తుంటే ఆ సినిమా యూనిట్ మాత్రం పండగే. ఖర్చుకు వెనకాడకుండా ఉంటాడని కూడా అంటారు. డిఫాల్టర్ విజయ్ మాల్యాకు చెందిన బంగ్లాను రూ. 73 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెబుతారు. ఈ వ్యవహారంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఓంకార్ గ్రూప్ నకూ, సచిన్ జోషి మధ్య ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. ఓంకార్ గ్రూప్ ప్రమోటర్లలో ఒకడైన సచిన్ దాదాపు 100 కోట్ల మేరకు అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ అతను నిర్లక్ష్యం చేశాడు. సచిన్ జోషి హాజరుకాకపోవడంతో ఈడీ అధికారులు అతన్ని అరెస్ట్ చేయక తప్పలేదు. దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయంలో సచిన్ జోషిని అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారు. ఇప్పటికే ఓంకార్ గ్రూప్ ఛైర్మన్ కమల్ గుప్తా, ఎండీ బాబు లాల్ వర్మను అరెస్ట్ చేశారు. ఆదాయపుపన్ను శాఖ అధికారులు కూడా సచిన్ జోషికి చెందిన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. సచిన్ జోషికి ముంబయిలో రెస్టారెంట్లు, క్లబ్బులు కూడా ఉన్నాయి. మోడల్, నటి ఊర్వశి శర్మను అతను పెళ్లి చేసుకున్నాడు. పాన్ మసాలా, బ్రెవరీ, డిస్టిల్లరీస్ లాంటి పరిశ్రమలూ ఉన్నాయి.
Must Read ;- టీవీ నైన్ రవిప్రకాష్‌కు మళ్లీ పూర్వ వైభవం..?











