తన పని తప్ప ఫలితం ఆలోచించని కర్మయోగి అతను. ఎంఎస్ ధోని టీమిండియా చరిత్రలో అలా ఓ సువర్ణాధ్యయం. అతడిలా మరొకరు ఉండరు..ఉండలేరు..సాధ్యం కాదు కూడా..అందుకే అతనికి బీసీసీఐ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. తన ట్విటర్ పేజ్ కవర్ ఫొటోగా ధోని చిత్రాన్ని ఉంచి.. టీమిండియాకు ధోని అందించిన అద్భుతమైన ఫలితాలకు గానూ ధన్యవాదాలు తెలిపింది.
ధోని ఫ్రమ్ రాంచీ..ధోని వచ్చే వరకు చాలా మందికి రాంచీ అనే ఒక ప్రాంతం ఉన్నట్లు కూడా తెలియదు. బిహార్ నుంచి వేరుపడిన ఓ మారుమూల ప్రాంతం రాంచీ. టీమ్ ఇండియాలో వచ్చిన అవకాశాల్ని ఒక్క దానిని కూడా చేజార్చుకోకుండా అందిపుచ్చుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.
2007 వరల్డ్ కప్ లో టీమిండియా ఇచ్చిన ప్రదర్శనకు ఆగ్రహంతో అభిమానులు ధోని ఇంటి పై రాళ్లు రువ్వారు. అతని చిత్ర పటాలు తగలబెట్టారు. వాస్తవానికి అప్పటికి అతను ఇంకా జూనియర్. కానీ నిందలన్నిటిని భరించాడు. నిరూపించుకునే సమయం కోసం ఓపిగ్గా ఎదురు చూశాడు.
2007 టీ20 వరల్డ్ కప్ కి జట్టును మొదటిసారి కెప్టెన్ గా నడిపించాలని సెలక్షన్ కమిటీ కోరినప్పుడు ధోని నా వల్ల కాదు అని చెప్పలేదు. స్పీడ్ గా దూసుకు వస్తున్న టిప్పర్ లారీలకు ఎదురుగా నిలబడే ధైర్యం ఉన్న ఆటగాళ్లను ఇవ్వండి అని మాత్రమే కోరాడు.
ధోని వరల్డ్ కప్ గెలిచినప్పటికీ టీమ్ లో అందరి కంటే ఓ జూనియర్ చేతికి ఆ కప్పు ఇచ్చి ఓ మూలకి వెళ్లి ఫోటోల కోసం నిలబడతాడు. టీమ్ ఓడిపోతే నా ప్రణాళికలు సరిగా లేవంటూ నిక్కచ్చిగా సమస్య ఎక్కడుందో విశ్లేషిస్తాడు. ఓటమి భారాన్ని తనే మోస్తూ ముందు నడుస్తాడు.
ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ టీమిండియాకు ఎప్పటికే అతనే సారథి. అందుకే మహేంద్రుడు అంటే అందరికీ అంత అభిమానం. ఎంత అభిమానం ఉండకపోతే ఏకంగా ఓ అభిమాని తన ఇంటి పేరునే ‘హోమ్ ఆఫ్ ధోని ఫ్యాన్’అని పెట్టుకుంటాడు.