తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరంగల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. జిల్లాల పర్యటనలు ప్రారంభించిన రెండో రోజే… టీఆర్ఎస్ కు కంచుకోటగా నిలిచిన వరంగల్ జిల్లాలో కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తాయి. ‘‘ఖబడ్దార్ కేసీఆర్ ఖబడ్దార్’’ అంటూ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు చేసిన నినాదాలు ఒక్కసారిగా వరంగల్ లో కలకలం రేపాయి. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినా… పోలీసుల వలయాన్ని దాటుకుని మరీ వచ్చిన విద్యార్థులు కేసీఆర్ ను హెచ్చరిస్తూ సంచలన నినాదాలు చేశారు.
రెండో రోజే నిరసనల హోరు
ఆదివారం సిద్దిపేట జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ప్రశాంతంగానే తన టూర్ ను ముగించారు. అయితే రెండో రోజైన మంగళవారం వరంగల్ జిల్లా పర్యటనకు కేసీఆర్ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం తదితరాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతేకాకుండా కాళోజీ పేరిట కొత్తగా ఏర్పాటు చేసిన వర్సిటీని కూడా కేసీఆర్ ప్రారంభించారు. ఈ క్రమంలో కాకతీయ యూనివర్సిటీ మీదుగా కేసీఆర్ వెళుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యార్థులు ఆయన కాన్వాయ్ కి అడ్డు తగిలారు.
పోలీసు జీపుల్లో నుంచీ నినాదాలు
కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తే ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల కళ్లుగప్పి ఎక్కడ దాక్కున్నారో గానీ… కేసీఆర్ కాన్వాయ్ తమకు సమీపంలోకి వచ్చీ రాగానే విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. అయితే కేసీఆర్ కాన్వాయ్ లోని కార్ల డ్రైవర్లు చాకచక్యంగా విద్యార్థులను తప్పించుకుని కార్లను ముందుకు దూకించగా… విద్యార్థులు మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగా ‘‘ఖబడ్దార్ కేసీఆర్ ఖబడ్దార్*’’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను తక్షణమే విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే… పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారంటూ ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు విద్యార్థులను నిలువరించేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయితే ఉద్యమ ఊపులో ఉన్న విద్యార్థులు.. పోలీసులు అరెస్ట్ చేసి జీపుల్లోకి ఎక్కించినా… ఖబడ్దార్ కేసీఆర్ ఖబడ్దార్ అన్న నినాదాలను హోరెత్తించారు.
Must Read ;- కేసీఆర్ టూర్ లో కరపత్రాల కలకలం.. పార్టీ నేతల్లో గుబులు











