రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఏ అంశం తీసుకున్నా ఆ పార్టీకి కలిసి రావడం లేదు. పథకాలు రివర్స్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నేతల మాటలు ఆ పార్టీని మరింత ఇబ్బందికర స్థితిలోకి నెడుతున్నాయి. అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఏ మాట్లాడితే ఏం ఆపద వస్తుందో అన్న అనుమానం ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇన్నాళ్ళు ఎదురులేని పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ప్రస్తుతం ఏ రోజు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళనలో ఉంది. పార్టీ నుండి ఒక్కో నేత జారిపోతున్నా చూస్తూ ఉండాల్సి వస్తోంది తప్ప ఆపలేని పరిస్థితి. కేసీఆర్ కనుసైగలతో ఇప్పటి వరకు నేతలను , రాష్ట్రాన్ని నడిపించగా ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా చేజారుతున్నా ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పార్టీ పరిస్థితిపై నోరు మెదపని కేసీఆర్.. ముఖ్యనేతలు
తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీ దూకుడు మీద ఉంటే టీఆర్ఎస్ మాత్రం కిమ్మనడం లేదు. ఉద్యమ కాలం నుండి టీఆర్ఎస్‌కు ఎదురొడ్డి నిలిచిన పార్టీ కాని , నేతలు కాని లేరు. ఎదురు నిలిచే నేతలు ఎవరైనా ఉంటే టీఆర్ఎస్‌లో చేరాలి లేదంటే కనుమరుగవ్వాలి. ఇదే తరహాలో గత ఆరేళ్ళుగా రాజకీయాలు సాగాయి. ఇక పార్టీపై ఈగ వాలినా అంతెత్తున లేచిన పార్టీ నేతలు ప్రస్తుతం నోరు మెదపడం లేదు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కాని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , ట్రబుల్ షూటర్‌గా చెప్పుకునే హరీష్, కేసీఆర్ కూతురు కవిత , మంత్రులు,. ఎమ్మెల్యేలు ఎవరూ నోరు తెరవడం లేదు. దుబ్బాక ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా కూడా ఒక్క కేటీఆర్ మినహా ఆ పార్టీ నేతలు ఎవరూ పెద్దగా బయట కనిపించిన దాఖలాలు లేవు. అంతర్గతంగా వ్యవహారాలు చక్కబెడుతున్నారని అంతా భావించారు… కాని ఫలితాలు వచ్చిన తరువాత కేటీఆర్ సైతం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి దిగాజరుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని టీఆర్ఎస్ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ముఖ్యనేతల మౌనం వెనక ఆంతర్యం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ నేతలను మండల స్థాయిలో పూర్తిగా తమ పార్టీలో కలిపేసుకుంటున్నారు బీజేపీ నేతలు.
డిచ్‌పల్లి టీఆర్ఎస్ ఖాళీ..
టీఆర్ఎస్‌కు షాక్ ఇస్తూ నిజామాబాద్ డిచ్‌పల్లి నేతలు శనివారం మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోయారు. ఆ మండల ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ సహా పది మంది ఎంపీటీసీలు, పది మంది సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు టీఆర్ఎస్‌కు రాం రాం చెప్పేశారు. ఏకంగా ఢిల్లీ వెళ్ళి మరీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఎంపీ అర్వింద్ పక్కా ప్లాన్ ప్రకారం టీఆర్ఎస్ నేతలను తమ వైపు తిప్పుకున్నారు. ఏకంగా కవిత ఇలాకాలోనే , కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు మంత్రి ప్రశాంత్‌రెడ్డి జిల్లాలోనే ఇలా జరగడంతో అంత ఖంగు తిన్నారు. టీఆర్ఎస్ పార్టీలో స్వతంత్రం లేక పోవడం, నిధుల కేటాయించక పోవడంతో ప్రజల ముందు తిరగలేక పోతున్నామని … వారికి కనీసం మొహం కూడా చూపించ లేక పోతున్నామంటూ స్థానిక సంస్థల ప్రతినిధులు విమర్శిస్తున్నారు . ఇంత జరిగినా టీఆర్ఎస్ నేతలు ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. బీజేపీ ఆకర్ష్ ఏకంగా టీఆర్ఎస్‌నే భూ స్థాపితం చేసే దిశగా సాగుతుండటంతో రాబోయే రోజుల్లో అధిష్టానం దీన్నిఎలా ఎదుర్కొంటుంది.. పార్టీని ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాలి.
Also Read: పొత్తు తప్పదా.. బీజేపీ ట్రాప్‌లో కేసీఆర్, ఎంఐఎం పడినట్టే..











