జీహెచ్ఎంసీ ఎన్నికలను చూశాక, బీజేపీ ట్రాప్‌లో ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీలు చిక్కుకున్నాయా..అందుకే ఫలితాల విషయంలో ఈ పరిస్థితి వచ్చిందా అనే చర్చ మొదలైంది. దుబ్బాక ఫలితాలు రాగానే ఓ వ్యూహం ప్రకారం సాగిన బండి సంజయ్ స్పీచ్‌లు, జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ అనంతరం బీజేపీ లీడర్ల ప్రసంగాలు, ఆ పార్టీ ముఖ్య నేతల రాక, వారు మాట్లాడిన విధానం..ఇలా అన్నీ వరుసగా పరిశీలిస్తే అవును అనే సమాధానమే వస్తోంది.
టీఆర్ఎస్‌కు పార్టీ మేయర్ పీఠం దక్కాలంటే..
ఇక జీహెచ్ఎంసీ ఫలితాల్లో ప్రస్తుతం 56 స్థానాలు గెలిచిన టీఆర్ఎస్‌కు పార్టీ మేయర్ పీఠం దక్కాలంటే ఆ పార్టీకి ఉన్న 38ఎక్స్ అఫిషియో ఓట్లు కాకుండా మరో 8 అవసరం అవుతుంది. దీంతో ఆ పార్టీ అటు ఎంఐఎం వైపు చూస్తోంది. ఎందుకంటే.. కాంగ్రెస్ నుంచి తీసుకుందామనుకున్నా..ఆ పార్టీకి ఉన్న ఇద్దరు సరిపోరు. మరో ఆరుగురు అవసరం అవుతారు. బీజేపీ నుంచి లేకుంటే ఎంఐఎం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నుంచి తమవైపు తిప్పుకుంటే.. రాజకీయంగా తీవ్ర విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంఐఎం పైనే ఆధారపడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సరిగ్గా బీజేపీ కూడా ఇదే కోరుకుంటోందని చెప్పవచ్చు.
‘వారికంటే భయంకరమైన హిందువును’
ఎందుకంటే గత లోక్‌సభ ఎన్నికల నుంచి బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం విమర్శించుకుంటూనే.. ఎంఐఎం – టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని విమర్శించాయి. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ వారే హిందువులుగా మాట్లాడుతున్నారని, తాను వారికంటే భయంకరమైన హిందువునని అని మాట్లాడుతూ..హిందుగాళ్లు..బొందుగాళ్లు అని వ్యాఖ్యానించడాన్ని బీజేపీ వివాదాస్పదం చేసింది. అప్పటి నుంచి ఎంఐఎం, టీఆర్ఎస్‌లు ఒక్కటేనని, కాంగ్రెస్ కూడా వారితోనే జతకడుతోందని విమర్శలు చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ కూడా బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని విమర్శిస్తూ వచ్చినా.. బీజేపీ మాత్రం విమర్శల తీవ్రతను పెంచింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ టీఆర్ఎస్‌ను, ఎంఐఎంను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారు. అయితే టీఆర్ఎస్ కొంత సంయమనం పాటించినా.. రోహింగ్యాల విషయం వచ్చేటప్పటికి.. MIM పార్టీ కీలక నేత అక్బరుద్దీన్ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీవీ, ఎన్టీఆర్ సమాధుల విషయం ప్రస్తావించారు. దీంతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల వల్ల నష్టం జరుగుతుందని గ్రహించింది. కేటీఆర్ ఆ అంశంపై మాట్లాడుతూ..ఇద్దరు పిచ్చోళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కాని అప్పటికే వాతావరణం వేడెక్కింది. ప్రముఖుల పర్యటనలూ బీజేపీకి కలసి వచ్చాయి. చివరికి కేసీఆర్ తాను కూడా హిందువునే అన్న రీతిలో పత్రికల్లో ఆర్టికల్స్ రాయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అప్పట్లోనే చర్చ మొదలైంది. ఒకరకంగా చెప్పాలంటే.. బీజేపీ ఈ విషయంలో తేనె తుట్టెను కదిలించింది. ఆ ట్రాప్‌లో టీఆర్ఎస్, ఎంఐఎం చిక్కాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ముందురోజు, ఎన్నికల రోజున కూడా బీజేపీ ప్రతి అంశాన్ని తనకు ఉన్న సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయించింది.
Must Read ;- రాష్ట్రంలో బీజేపీ ‘బండి’లాగే సమర్ధుడు సంజయుడే!
కేసీఆర్ స్పీచ్‌లో మార్పు..
ఇక ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలోనూ కేసీఆర్ తన మాటల తూటాలు పెద్దగా పేల్చలేదు. ప్రాంతీయ వాదంపై ఎక్కువగా మాట్లాడే కేసీఆర్.. ఎల్‌బీ స్టేడియంలో జరగిన బహిరంగ సభలో ఆ ప్రస్తావన తేలేదు. ‘హైదరాబాద్ ను కాపాడుకుందాం. ప్రశాంత హైదరాబాద్ ను ప్రగతి మార్గంలో నడిపిద్దాం. అంతా మనమే..నేను తెలంగాణ బిడ్డను..టీఆర్ఎస్ ఇక్కడ గెలవకపోతే.. ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టే వారు గెలుస్తారు.. హైదరాబాద్ ప్రశాంతత దెబ్బ తింటుంది.. ఆస్తుల విలువలు పోతాయి’..అని పరోక్ష వ్యాఖ్యలు చేశారే కాని..డైరక్ట్‌గా చెప్పలేదు. ప్రాంతం, మతం అనే మాట రాలేదు. ఆచితూచి మాట్లాడారని చెప్పవచ్చు.
కొత్త ప్రయత్నాలు..
ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక కొన్ని పార్టీలను, కొందరు వ్యక్తులను దూరంగా పెట్టిన కేసీఆర్.. ఇటీవలి కాలంలో ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టడం, వామపక్ష భావజాలం ఉన్న వారిని దగ్గరకు తీసుకోవడం, ఆర్టికల్స్ రాయించుకోవడం గమనార్హం. అయినా ఎన్నికల్లో ఫలితాలు టీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగానే వచ్చాయని చెప్పవచ్చు.
ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం విషయంపై బీజేపీ మౌనం
తీరా ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ తనకు ఉన్న ఎక్స్ అఫిషియో ఓట్లు కలిపినా..మేయర్ పీఠం దక్కాలంటే..మరో 8 సీట్లకోసం ప్రయత్నాలు చేయక తప్పని పరిస్థితి. వాస్తవానికి పోలింగ్ శాతం చూసి.. బీజేపీ కూడా డీలా పడిందని చెప్పవచ్చు. పైకి టీఆర్ఎస్, బీజేపీలు ధీమా వ్యక్తం చేస్తున్నా..లోలోన మాత్రం ఆందోళన పడినట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితే కచ్చితంగా వస్తుందని బీజేపీ ఊహించకపోయినా.. ఎంఐఎం, టీఆర్ఎస్ ఒక్కటేనని నిరూపించడమే లక్ష్యంగా ఉందని చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల్లోని విషయాలు, ఎంఐఎం విస్తరణ అంశాలను ఇక్కడ మచ్చుకైనా బీజేపీ ప్రస్తావించదు. కేవలం హైదరాబాద్ విషయంపైనే మాట్లాడడం కూడా ఆ వ్యూహంలో భాగమే అని చెప్పవచ్చు.
టైం కోసం బీజేపీ
ఇప్పుడు మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ చేసే ఏ ప్రయత్నాన్ని అయినా..బీజేపీ విమర్శించకుండా వదిలే పరిస్థితి లేదు. అటు ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే.. అది తాము ముందే చెప్పామని, అదే నిజమని చెబుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అంశమే ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకోవచ్చు. ఒక వేళ బీజేపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకున్నా.. అది రానున్న ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా ప్రచార అంశంగా మారనుంది. మొత్తంమీద దాదాపు రెండు దశాబ్దాలుగా కేసీఆర్ ప్రాంతీయ వాదం కేంద్రంగా రాజకీయం చేస్తే..బీజేపీ మరో సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయం చేసిందని చెప్పవచ్చు.
Also Read ;- కాషాయ తీర్థం పుచ్చుకున్న రాములమ్మ