తెలంగాణను వర్షాలు వణికిస్తున్న కారణంగా ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న గ్రేటర్ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.
రోజుల్లోనే సీన్ మారిపోయింది
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరు చెప్పలేరు. అందుకే అంటారు రాజకీయాలకు మించిన అనిశ్చితి మరెక్కడా ఉండదని. అప్పటివరకు అంతా బాగానే ఉన్నట్లు ఉంటూనే.. రోజుల్లోనే సీన్ మారిపోయే పరిస్థితి రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటుంది. వచ్చే నెలాఖరులో గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి.. డిసెంబరు చివరి వారం.. లేదంటే జనవరి మొదటి వారంలో గ్రేటర్ హైదరాబాద్ కు ఎన్నికల్ని పూర్తి చేయాలనుకున్న ముందస్తు ప్లాన్ కు వర్షం దెబ్బేసింది.
ఏదో అలా వచ్చి ఇలా పోయే వర్షాలు అనుకున్న స్థానే.. అందుకు భిన్నంగా హైదరాబాద్ మహానగర తాట తీసేలా వర్షం పడటం ఒక ఎత్తు అయితే.. అక్రమ నిర్మాణాలను చూసిచూడనట్లుగా ఉండటం.. ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేసిన అధికారుల పుణ్యమా అని హైదరాబాద్ ఇప్పుడు ఆగమాగమైన పరిస్థితి. హైదరాబాద్ మహానగరంలో విపత్తు విరుచుకుపడితే.. ఏం జరుగుతుందన్నది గడిచిన ఐదు రోజులుగా నగర ప్రజల అనుభవంలోకి వచ్చేసింది. ఐదారు కోట్లు విలువైన విల్లాలు.. కోట్ల రూపాయిల ఫ్లాట్లు సైతం వరదనీటిలో చిక్కుకుపోయిన తీరుతో భారీ షాక్ లో ఉన్నారు నగర ప్రజలు.
నాయకులపై ఆగ్రహం
ఇదంతా ఒక ఎత్తు అయితే.. విపత్తును హెచ్చరించటం.. ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించే విషయంలో గ్రేటర్ అధికారులు ఫెయిల్ అయ్యారని చెబుతున్నారు. ఇదెక్కడి వరకు వెళ్లిందంటే.. కార్పొరేటర్లను.. స్థానిక నేతల్ని అడ్డుకోవటం..చేయి చేసుకోవటం వరకు వెళ్లింది. మొన్నటికి మొన్న ఉప్పల్ అధికారపక్ష ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ముంపు ప్రాంతాలకు వెళ్లినప్పుడు బాధిత మహిళలు తీవ్రఆగ్రహావేశాల్ని ప్రదర్శించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇలాంటి ఉదంతాలు చాలానే చోటు చేసుకున్నా.. కొన్ని మాత్రమే వైరల్ గా మారినట్లు చెబుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు ఖాయమన్న ధీమాతో ఉన్న టీఆర్ఎస్ అధినాయకత్వానికి తాజాగా కురిసిన వానలు కొత్త సందేహాలు తెచ్చినట్లు చెబుతున్నారు. దీనికి తోడు.. గడిచిన మూడు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలతో గ్రేటర్ ఎన్నికల నిర్వహణ విషయంపై పునరాలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మరో మూడు.. నాలుగు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉండటం.. నగరానికి నష్టం జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. ముందుగా అనుకున్నట్లు కాకుండా.. ఆర్నెల్లు ఆగిన తర్వాత ఎన్నికలు నిర్వహించే దిశగా టీఆర్ఎస్ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అంతర్గతంగా ఎమ్మెల్యేల ఫీడ్ బ్యాక్ ను తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.