విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణవార్తను నిన్న ఉదయం టీవీలలో చూసిన వారు ‘అరె… జయప్రకాష్ రెడ్డి పోయాడా?’ అనుకున్నారు. ఇలాంటి మాటలు ఆయన నోటి నుంచే వస్తే విచిత్రమే కదా. ఓ ఇంటర్వ్యూలో జయప్రకాష్ రెడ్డి ఇలాంటి విషయం గురించే మాట్లాడారు. మన శాస్ర్తం ప్రకారం బ్రహ్మ మనం ఎప్పుడు మరణిస్తామో రాసేసి పెట్టి ఉంటాడని ఆయన పేర్కొన్నారు.
ఫలానా అప్పుడు ఫలానా టైములో వెళ్లిపోతాడు అని రాస్తాడు. ఆ వెళ్లిపోవడం అనేది రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారి లేచేటప్పటికి ‘అరే పోయాడే… అనుకునేటట్టుగా అనుగ్రహించు స్వామీ అని దణ్ణం పెట్టుకుంటాను. ఆయన మాటల్ని తథాస్తు దేవతలు విన్నారో ఏమోగాని ఆయన అన్నట్లుగానే ఆయన మరణం సంభవించింది. ‘ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా… ఎవర్నీ కష్టపెట్టకుండా మంచం మీద పడుకుని నలుగురితో సేవలు చేయించుకోవడం వారిని ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా. అలా ఇబ్బంది పెట్టకూడదనేది నా ఉద్దేశం అన్నమాట.’ అంటూ వివరించారాయన.
‘నేనెవరినీ ఇబ్బంది పెట్టకూడదు… ఎలా వచ్చానో అలాగే వెళ్లిపోవాలి’ అన్నట్లుగానే ఆయన వెళ్లిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వారిని సైతం జయప్రకాష్ రెడ్డి ఆకర్షించగలిగారంటే ఆయన వ్యక్తిత్వమే కారణం. నిన్న జయప్రకాష్ రెడ్డి మరణం తర్వాత ఈ ఇంటర్వ్యూలో ఈ భాగం వైరల్ అవుతోంది. ఇలాంటి విషయాలు చూసి అయినా మన నోటి నుంచి ఎప్పుడూ మంచి మాటలే వస్తే బాగుండునేమో అనిపిస్తోంది. ఎవరైనా ఇలా మాట్లాడితే మన పెద్దలు కూడా పైన తథాస్తు దేవతలుంటారంటూ హెచ్చరించేవారు. పెద్దల మాట చద్దిమూట అన్నది అందుకే.











