టాలీవుడ్ దర్శకులలో చంద్రశేఖర్ యేలేటి స్థానం ప్రత్యేకం. ఆయన ఎంచుకునే కథలు విభిన్నంగా .. విలక్షణంగా ఉంటాయి. పాత్రలను ఆయన మలిచే తీరు సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. కథలో భాగంగా .. కథనుబట్టి పాత్రలు నడచుకుంటూ ఉంటాయేగానీ, పాత్ర చుట్టూ కథ తిరగదు. ‘ఐతే’ .. ‘మనమంతా’ సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనాలుగా కనిపిస్తాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ‘చెక్’ సినిమా రూపొందింది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఈ రోజు సాయంత్రం హైదరాబద్ – మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకి రాజమౌళి – వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా రానున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, చంద్రశేఖర్ యేలేటి తన తదుపరి సినిమాకి సైన్ చేసినట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ఒక స్టార్ హీరోతో ఆయన సినిమా ఉండనున్నట్టుగా చెబుతున్నారు. అంతేకాదు ఆ తరువాత మరో ప్రాజెక్టును కూడా ఆయన అంగీకరించడం జరిగిపోయిందని అంటున్నారు.
ఇప్పటివరకు చంద్రశేఖర్ ఒక సినిమా తరువాత ఒకటిగా నిదానంగా .. నింపాదిగా చేస్తూ వస్తున్నారు. అయితే ఇకపై ఒక ప్రాజెక్టుకి మరో ప్రాజెక్టుకి మధ్య పెద్ద గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేయాలనే ఆలోచనలో చంద్రశేఖర్ యేలేటి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇకపై తన కథల్లో కమర్షియల్ అంశాలను కూడా కలుపుతూ వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఆయన తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వచ్చే శుక్రవారం థియేటర్స్ కి రానున్న ‘చెక్’ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.











