బండెడు సినిమాలు చేస్తేనే గాని దక్కని క్రేజ్ .. ప్రభాస్ కి ఒక్క ‘బాహుబలి’ సినిమాతో దొరికింది. అంతే ఆ తరువాత ప్రభాస్ మామూలు సినిమా గురించి ఆలోచన చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆయనతో వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. కానీ ప్రస్తుతం ఆయన డైరీ ఒక ఐదేళ్లవరకూ ఖాళీలేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు ఒప్పేసుకుని, తీరికగా ఆయన వాటిని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు. ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ ముగింపు దశలో ఉండగా, ‘సలార్’ ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది.
ఈ క్రమంలోనే ప్రభాస్ తో నాగ్ అశ్విన్ కూడా ఒక సినిమా చేయనున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ – ఫాంటసీ కలిసిన కథ. అందువలన అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుంది. వైజయంతీ బ్యానర్ పేరును నిలబెట్టేదిగా ఈ సినిమాను రూపొందించాలనే ఆలోచనలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నాడు. అయితే సినిమాను ఎనౌన్స్ చేసిన దగ్గర నుంచి మళ్లీ ఈ ప్రాజెక్టును గురించిన విషయాలను నాగ్ అశ్విన్ చెప్పకపోవడం పట్ల ప్రభాస్ అభిమానులు అసహనానికి లోనవుతున్నారు. దాంతో ఈ విషయంపై నాగ్ అశ్విన్ స్పందించాడు.
“ఒక వైపున ప్రభాస్ హీరోగా ‘రాధే శ్యామ్’ సినిమా రూపొందుతోంది. మరో వైపున ‘సలార్’ నిర్మితమవుతోంది. ఇక త్వరలో ‘ఆదిపురుష్’ షూటింగులో ప్రభాస్ జాయిన్ కానున్నాడు. ఇలాంటి సమయంలో నేను ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీని గురించి మాట్లాడితే, అంతా కన్ఫ్యూజ్ అవుతారు. అంతేకాదు ఆ గందరగోళంలో ఇచ్చిన అప్డేట్ ను వెంటనే మరిచిపోవడం జరుగుతుంది. అందువల్లనే నా సినిమాను గురించి ప్రస్తుతం నేను ఏమీ చెప్పదలచుకోలేదు. ప్రభాస్ ‘ఆది పురుష్’ చేస్తున్నప్పుడు, ఆ తరువాత ప్రాజెక్టు నాదే గనుక అప్పుడు నేను అప్డేట్ ఇస్తే బాగుటుంది” అంటూ చెప్పుకొచ్చాడు.