అక్కినేని ఫ్యామిలీలో పెళ్లిళ్లు అచ్చిరావనేది ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దానికి ఎన్నో ఉదాహరణలు పేర్కొంటున్నారు. నిజానికి నేటి సమాజంలో పెళ్లి అనే బంధం ఎప్పుడు పెటాకులుగా మారుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఇదే అంశాన్ని అక్కినేని ఫ్యామిలీకి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అనేది మరో ప్రశ్న. ఎన్టీఆర్, ఏయన్నార్.. తెలుగు సినిమా రంగానికి ఈ ఇద్దరూ రెండు కళ్లు. వారి వివాహాలు మాత్రం పెద్దల అభీష్టం మేరకే జరిగాయి. సినిమా హీరోయిన్లతో సంబంధాల మీద వదంతులు వచ్చినా అవి పెళ్లి పీటల వరకూ వెళ్లలేదు. అక్కినేని నాగేశ్వరరావు విషయంలో మేనత్త కూతురితో పెళ్లి ప్రతిపాదన వచ్చినా మొహానికి రంగులు వేసేవాడికి తమ పిల్లను ఇవ్వబోమని బంధువులు అన్నారట.
చివరికి అన్నపూర్ణమ్మతో ఆయన వివాహం జరిగింది. ఆయనకు వెంకట్, నాగార్జున కుమారులు. కుమార్తెల పెళ్లిళ్ల విషయంలో కొన్ని అపశ్రుతులు దొర్లాయి. నాగార్జున వివాహం మాత్రం రామానాయుడు కుమార్తె లక్ష్మితో 1984లో జరిగింది. వారి కుమారుడే నాగ చైతన్య. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ అమలను నాగార్జున ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి పుట్టిన కుమారుడే అఖిల్. వీరి దాంపత్యం మాత్రం అన్యోన్యంగా సాగుతోంది.
మేనల్లుడు సుమంత్ విషయంలో..
నాగార్జున మేనల్లుడు సుమంత్ పెళ్లి విషయంలోనూ అపశ్రుతులు దొర్లాయి. తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని సుమంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏయన్నార్ కుమార్తె సత్యవతి, యార్లగడ్డ సురేంద్ర కుమారుడే ఈ సుమంత్. వీరి దాంపత్యం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. అప్పట్నుంచి ఇప్పటికీ సుమంత్ పెళ్లి చేసుకోలేదు. నాగచైతన్య, సమంతల ప్రేమ పదేళ్ల నాటిది. వీరిద్దరూ కలిసి ఏమాయ చేశావే సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. అప్పటికే సమంతకు హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయణం సాగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
అతనితో బ్రేకప్ జరిగాక సమంత చైతూతో ప్రేమలో పడిందంటారు. అది పెద్దగా పట్టించుకోకపోయినా అక్కినేని కుటుంబం ఆమెను కోడలిగా చేసుకోడానికి ముందుకు వచ్చింది. 2017లో వీరి వివాహం జరిగింది. కచ్చితంగా నాలుగేళ్లకు ఈ జంట విడిపోయింది. ఇక అఖిల్ విషయానికి వస్తే అఖిల్ కు ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మనుమరాలు శ్రీయా భూపాల్ తో 2016లో నిశ్చితార్థం జరిగింది.
అది పెళ్లి పీటల దాకా కూడా వెళ్లలేదు. కొద్ది కాలంలోనే ఆ బంధం తెగిపోయింది. ఇవన్నీ కాకతాళీయంగానే జరిగినా సోషల్ మీడియాలో మాత్రం పెద్ద చర్చనీయాంశమైంది. సాధారణంగా పెళ్లిళ్ల విషయంలో ఒకప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకునే వారు. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేయాలనేవారు ఒకప్పుడు. ఈరోజున ఆ పరిస్థితి లేదు. ఫలానా అమ్మాయికి లేదా ఫలానా అబ్బాయికి లవ్ ఎఫైర్ ఉందని ఎవరైనా చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
పెళ్లయ్యాక సక్రమంగా ఉంటే చాలు అనుకుంటున్నారు. బహుశా ఆ నమ్మకంతోనే నాగార్జున కుటుంబం సమంతను తమ కుటుంబలోకి కోడలిగా ఆహ్వానించి ఉండొచ్చు. ఒక్కటి మాత్రం నిజం ఈరోజుల్లో పెళ్లి అనే మాట వింటేనే భయపడే రోజులొచ్చాయి. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అంతేగాని అక్కినేని కుటుంబానికి పెళ్లిళ్లు అచ్చిరావనే మాటలో నిజం లేదు.
Must Read ;- సమంతపై హీరో సిద్ధార్థ్ ట్వీట్ వైరల్











