కాంగ్రెస్ పార్టీ నేతగా, మాజీ మంత్రిగా, మరీ ముఖ్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అనుచర వర్గంలో కీలక నేతగా నీలకంఠాపురం రఘువీరారెడ్డి మంచి గుర్తింపు ఉంది. వైఎస్సార్ సీఎంగా ఉండగా.. ఉమ్మడి రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి.. పనితీరులో తానెంత నిక్కచ్చి మనిషో చెప్పేశారు. వైఎస్సార్ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా.. ముందుగా రఘువీరానే అడిగేవారట. ఈ దిశగా వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగేవట. రాజశేఖరరెడ్డి నిద్ర లేవక ముందే మేల్కొనే రఘువీరా.. వైఎస్సార్ నుంచి వచ్చే పిలుపు కోసం ఎదురు చూసేవారట. ఇలా రఘువీరా, ఇతర తన ముఖ్య అనుచరులతో చర్చల సందర్భంగా 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాలకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారట. ఇదేదో రఘువీరా స్వయంగా చెప్పుకున్న విషయం కాదు. వైఎస్సార్‌ను అతి దగ్గరగా చూసి ఆయన మరణం తర్వాత ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ ఆయా పార్టీల నేతలు, అధికారులు చెప్పిన మాటలు ఇవి. మొత్తంగా చెప్పొచ్చేదేమంటే.. ఏ పని చేపట్టినా రఘువీరా నిబద్ధతతో చేస్తారు. అందుకు నిదర్శనంగా ఇప్పుడు మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
వర్షంలోనూ కూర్చుని..
అనంతపురం జిల్లాలోని మడకశిర మండలానికి చెందిన నీలకంఠాపురం గ్రామం రఘువీరారెడ్డి సొంతూరు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రాజకీయాలపై విరక్తి కలిగిన రఘువీరా.. పీసీసీ చీఫ్ పదవిని సైతం వదిలేసి నేరుగా తన సొంతూరు వెళ్లి రైతు బిడ్డగా మారిపోయారు. అంతేకాకుండా గ్రామంలో నీలకంఠేశ్వరుడి ఆలయాన్ని తన సొంత నిధులతో నిర్మించి దేవుడి సేవలోనే తరిస్తున్నారు. ఇలాంటి క్రమంలో బుధవారం నాడు తన పెదనాన్న, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీరామిరెడ్డి 115 జయంతి ఉత్సవాలను రఘువీరా ఘనంగా జరిపారు. ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఉచిత గుండె వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. బెంగుళూరుకు చెందిన పీపుల్ ట్రీ హాస్పిటల్ వైధ్యులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. పరిసర గ్రామాల ప్రజలు ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో జన్మించిన శ్రీరామిరెడ్డి మహోన్నత స్ధాయికి ఎదగడం, ప్రధాన మంత్రికి సలహాలు ఇచ్చేస్థాయిలో ఉండడం ఎంతో గొప్ప విషయమన్నారు, విధ్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో నడవాలన్నారు. ఇదిలా ఉంటే.. జాయింట్ కలెక్టర్ ప్రసంగిస్తుండగా వర్షం రావడంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా పరుగు పరుగున కుర్చీల్లో నుంచి లేచి చెట్లచాటుకు వెళ్లారు. అయితే రఘువీరా మాత్రం వర్షంలో తడుస్తూనే అలాగే కుర్చీలో కూర్చిండిపోయి ముఖ్యఅతిథి మాటలు వింటూ గౌరవమిచ్చారు. ఈ దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.
Must Read ;- ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఇంకా..











