‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనేది ఒకప్పటి మాట.. నేటి కాలంలో ఎంత ఎక్కువ కలిసి ఉంటే అంత ఎక్కువ సమస్యలు వస్తాయనేది నేటి మాట. కరోనా కారణంగా కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో.. కుటుంబమంతా ఒకచోట ఉండే అవకాశాలు వచ్చాయి. మరికొందరి విషయంలో కావాల్సిన వారు ఎక్కడో ఇరుక్కుపోయారు. ఇంకొందరి విషయంలో ఇష్టం లేని వ్యక్తులతో బలవంతంగా కలిసుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఎన్నో పరిణామాలకు ఊతమిచ్చింది కరోనా ‘లాక్ డౌన్’.
కౌన్సలింగ్, కోర్టుల్లో పెరిగిన కేసులు
లాక్ డౌన్‌కి ముందుతో పోలిస్తే ఫ్యామిలీ కోర్టుల్లో, కౌన్సలింగ్ సెంటర్లో దంపతుల కేసులు ఎక్కువయ్యాయని నివేదికలు చెప్తున్నాయి. జిల్లా కేంద్రాల్లోని కోర్టుల్లో దాదాపు రోజుకు 12 నుండి 15 కేసుల విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారంటేనే తీవ్రత ఏ స్థాయికి చేరుకుందో తెలుస్తుంది. ఇక కౌన్సిలింగ్ వివరాలు చూస్తే, లాక్ డౌన్‌కు 3-4 కేసులు వచ్చేవని.. ఇప్పుడు రోజుకి ఏకంగా 10-12 జంటలు కౌన్సలింగ్ వస్తున్నట్లుగా ఒక కౌన్సలర్ తెలిపారు. వీటికి వారు పలు రకాల కారణాలు చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందామా..
గృహహింసలు..
కరోనా నేపథ్యంలో ఇంటి నుండి పని చేయడం మొదలుపెట్టారు. కానీ, మహిళల విషయంలో ఇది శాపంగా మారింది. వారు ఇంటిలో ఉండడంతో ఇంటి నుండి పని చేస్తున్నట్లుగా కుటుంబసభ్యలు గుర్తించలేదు. ఇంట్లో ఉన్నందున.. ఆఫీసుకు వెళ్తున్నప్పుడు చేయలేని పనులను చేయాల్సిందిగా కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి మొదలైంది. దీనికి తోడు శారీరికంగా హింసకు గురిచేయడం, మానసికంగా కుంగిపోయేలా దుర్భాషలాడడం వంటి కేసులు పెరిగాయి. వీటి వల్ల కొందరు మహిళలు వీటిని ఇక తట్టుకోలేమనే పరిస్థితిలో విడాకుల దిశగా అడుగులు వేశారు.
స్వయంకృతాపరాదం..
ఇక ఇంకొన్ని స్వయంకృతాపరాదాలనాలి.. ఇంటి నుండి పనిచేస్తున్నప్పుడు ఆఫీస్ ఫోన్స్, సమాచారాలు, మెయిల్స్.. ఇలాంటి వన్నీ సహజం. ఆఫీసు నుండి వస్తున్న ఫోన్ కాల్స్, ఫోన్ సమాచారాలు కొత్త అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇది అటు మగవారికి.. ఇటు ఆడవారికి కూడా వర్తిస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నవు? ఎందుకు? నువ్వు మాత్రమే సమస్య పరిష్కరించాలా? ఇన్ని సార్లు ఎందుకు చేస్తున్నారు? ఇలా పలు అనుమానాలతో లేని సమస్యలను కొని తెచ్చుకుని మరీ తమ అనుబంధం బీటలు వారేలా చేసుకున్నారు.
అసలు విషయాలు బయటకొచ్చాయి
ఇలా లేని అనుమానాలతో కొందరు తమ సంసాలకు ఎసరు పెట్టుకుంటే.. మరికొందరి బాగోతాలు భయడపడ్డాయి. ఈ లాక్ డౌన్ సమయంలో కొందరి అక్రమ విషయాలు వెలుగులోకి రావడం లేదా ఇప్పటి వరకు అంతగా పట్టించుకోకుండా వదిలేసిన విషయాలను ఈ లాక్ డౌన్ సమయంలో పెద్దవి చేసి పోట్లాడుకోవడానికి కొందరికి బాగా సమయం దొరికింది. ఇలాంటి కారణాల వల్ల కూడా చాలా మంది తమ దాంపత్యానికి స్వస్తి పలికే దిశగా అడుగులు వేశారు.
ఉద్యోగ లేమి.. ఆర్థిక ఇబ్బందులు
కరోనా కారణంగా చాలామందికి ఉద్యోగాలు పోయాయి. దాని వల్ల ఆర్థికంగా పరంగా కుటుంబాల్లో సమస్యలు తలెత్తాయి. ఇవి కాస్త మనస్పర్థలకు దారి తీస్తున్నాయి. ఆర్థిక పరమైన అభద్రతా భావం దంపతుల మధ్య అడ్డుగోడగా మారడంతో ఎప్పుడూ లేని విధంగా అవతవి వారి నుండి చులకన మాటలు ఎదుర్కోవాల్సి రావడంతో మానవ సంబంధాలు డబ్బుతో కూడుకున్నవనే భావనలు ఇరువురి మధ్య పెరిగి సత్సంబంధాలను దెబ్బతీస్తున్నాయి.
ఎక్కువగా విడాకులు కోరుతున్నది వీళ్లే..
ఇవే కాదు.. ఎక్కువ సమయం కలిసి ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి నుండి కోరుకున్న సంతృప్తి దొరక్కపోవడం, అవతలి వ్యక్తి లోపాలు కూడా బయటపడుతున్నారు. వాటిని సరిచేసుకోవాలనే ఆలోచన లేకపోగా.. ఇలాంటి వారితో ఉండాలా అనే ఆలోచన ధోరణి ఇలాంటి తీవ్ర నిర్ణయాలకు దారి తీస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాదు.. భర్తతోపాటు.. ఇతర కుటుంబ సభ్యుల హింసిండం.. ఇలా పలు కారణాలు చెప్తున్నారని నిపుణులు చెప్పుకొచ్చారు. విడాకులు, కౌన్సలింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నవారిని గమనిస్తే.. ఎక్కువ శాతం మంది యువ జంటలు ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. పైళ్లై 5 ఏళ్లు కూడా కానీ వాళ్లే ఎక్కువగా విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఏంటి పరిష్కారం?
ఏదో సినిమాలో చెప్పినట్లు.. లోపాలు సర్దకోవాలి.. తప్పులు సరిదిద్దుకోవాలి.. కుటుంబ నిర్ణయాలు కలిసి తీసుకోవాలి. ఇలాంటి పాటిస్తే ఏ జంటకు కూడా కౌన్సలింగ్ అవసరముండదు. నువ్వేంటి నాకు చెప్పేది అని భర్త అన్నా.. నీ మాట నేను వినాలా అనే ధోరణి భార్యలో ఉన్నా.. అవి కాపురాల విచ్ఛిన్నానికి దారి తీస్తాయే తప్ప.. కలిసి ఉండడం కల్లగా మిగిలిపోతుంది. కాబట్టి కరోనా అనే కాదు.. ఎన్ని సమస్యలు వచ్చినా కలిసి బతకాలనే ఆలోచనతో ఇరువురు నడిస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది.