(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయ పాలక మండలిలోని ఓ సభ్యురాలి భర్త, మాజీ రెవెన్యూ అధికారి స్వామి వారి కోనేరు ‘ఇంద్రపుష్కరిణి’లో ఇటీవల కర్మకాండలు నిర్వహించినట్లు తెలిసింది. ఇక్కడ ఇటువంటివి నిర్వహించకూడదనే నిబంధనను ఉల్లంఘించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరోనా నేపథ్యంలో కలెక్టర్ నివాస్ ఆదేశాల మేరకు ఇంద్రపుష్కరిణిని మూసేశారు. అక్కడ స్నానానికీ భక్తులను అనుమతించడం లేదు. ఇనుప బారికేడ్లను నిర్మించేశారు. ఇవేమీ పట్టించుకోకుండా ఓ మాజీ రెవెన్యూ అధికారి పుష్కరిణిలో దిగి కర్మకాండలు చేయడాన్ని భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆలయ మర్యాదలను మంటగలిపారని ఆరోపిస్తున్నారు.
సిబ్బంది నిలువరించినా..
కర్మకాండ చేసేందుకు వెళ్లిన ఆయనను ఇద్దరు సిబ్బంది నిలువరించినప్పటికీ, వారిపై విరుచుకుపడినట్లు భోగట్టా. ఈ విషయమై ఈవో హరి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేపడతామని స్పష్టం చేశారు.
Must Read ;- రగిలిపోతున్న రాజులు.. వెల్లంపల్లి పోస్టుకు ఎసరేనా?