అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరు వేంకట గిరినాధుని సన్నిధి.. క్లిష్ట సమయంలోనూ భక్తకోటికి స్వర్గధామంగా అలరారుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యం.. భక్తుల భద్రత పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో.. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రబలుతున్నప్పటికీ.. శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు. పైగా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో.. వారికి గతంలో ఎన్నడూ లేని దివ్యానుభూతి కలుగుతోంది.
కరోనా మహమ్మారి బెడదకు నెలలపాటు మూతపడిన తిరుమలేశుని ఆలయాన్ని తిరిగి తెరచిన తర్వాత.. పరిమితంగా మాత్రమే భక్తుల్ని అనుమతిస్తున్నారు. రద్దీ తక్కువగా ఉండడంతో భక్తులు కరోనా గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. ప్రశాంత వాతావరణంలో భగవద్దర్శనం చేసుకుంటున్నారు. ఆలయ పూజారులు సహా, టీటీడీ సిబ్బందిలో పలువురికి కరోనా పాజిటివ్ గా తేలినప్పటికీ.. పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగడం లేదు.
రద్దీ తక్కువగా ఉండడం వలన తిరుమల గిరులు, పరిసరాల్లోని పాపవినాశం, గోగర్భం ఇతర ప్రాంతాలన్నీ ప్రశాంతంగా ఎలాంటి కాలుష్యం లేకుండా తుల్యంగా అలరారుతున్నాయి. తిరుమలకు వచ్చే భక్తులు పరిసరాల ప్రకృతి సౌందర్యాన్ని కూడా అనుభూతి చెందుతున్నారు. మొత్తానికి ఈ క్లిష్ట సమయంలో కూడా తిరుమల గిరులు భక్తులకు మంచి అనుభూతి అందిస్తున్నాయి.