జగన్ ప్రభుత్వం మరోమారు సినీ పరిశ్రమను వేధించేందుకు సిద్ధమయ్యిందా ? సినిమా టికెట్ లను ఆయన లైన్ ద్వారా విక్రయించాల్సిందే అంటూ హుకుం జారీ చేసిందా ? ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాల్సిందే అంటూ వైసీపీ సర్కార్ జారీ చేసిన ఆదేశాలతో ఎగ్జిబిటర్లు ఎందుకు కంగుతిన్నారు ? ఒప్పందాలపై సంతకం చేసేందుకు వారు వ్యక్తం చేస్తున్న ఆందోళన ఏమిటి ?
ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి, సినిమా పరిశ్రమకు మధ్య మళ్ళీ వివాదం మొదలయ్యింది. సినిమా టికెట్ లను ఆన్లైన్లో విక్రయించాల్సిందే అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ వివాదానికి కారణంగా కనిపిస్తోంది.ఈ మేరకు ఓ జివోను కూడా విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం నెల రోజుల్లో థియేటర్ లు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాలని, లేని పక్షంలో థియేటర్ లైసెన్స్ లను రద్దు చేస్తామంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ సర్కార్ మళ్ళీ సినీ పరిశ్రమను వేధించేందుకు సిద్ధమయ్యిందనే చర్చ జోరందుకుంది.
సినిమా టికెట్ లను ఆన్ లైన్ ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఈ నెల 2వ తేదీన దీనికి సంబంధించి జీవో నెంబర్ 69 ని విడుదల చేసింది. మిగితా ప్రైవేట్ పోర్టల్స్ మాదిరిగానే APFDC రూపొందించిన గేట్ వే ద్వారా విక్రయాలు జరగాలని ఆదేశించింది. ఈ మేరకు ఎంవోయూ లను తయారు చేసి థియేటర్ లకు పంపింది.జులై రెండవ తేదీలోగా ఎగ్జిబిటర్లు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పంపాల్సిందే అంటూ జగన్ ప్రభుత్వం వారిపై ఒత్తిడి తెస్తోంది. అయితే ప్రభుత్వం పంపిన ఎంవోయూ పై ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ప్రధానంగా ఎంవోయూ లో స్పష్టత లేకపోవడమే దీనికి కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది.
వాస్తవానికి ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం తర్వాత ప్రైవేట్ పోర్టల్స్ అన్నీ అదే రోజు రాత్రికే ఎగ్జిబిటర్ల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తాయి.ఇదే అంశాన్ని పేర్కొంటూ ఆన్ లైన్ విక్రయాల తర్వాత ఏ రోజు డబ్బును ఆదేరోజు తమ ఖాతాల్లో జమ చేయాలి అని, అలా అయితేనే తాము ఆన్ లైన్ విక్రయాలకు ఓకే చెబుతామని ఇప్పటికే థియేటర్ ల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ, ప్రభుత్వం రూపొందించిన ఎంవోయూ లో మాత్రం థియేటర్లకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారో ఎక్కడా పేర్కొనలేదు.
ఇదిలా ఉంటే ఆన్ లైన్ విక్రయాల్లో ప్రభుత్వానికి కమీషన్ వస్తుంది, ఈ నేపధ్యంలో ఆ విక్రయాలు జరిపేందుకు థియేటర్ లలో కావలసిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.కానీ దానికి భిన్నంగా అవన్నీ థియేటర్ లే ఏర్పరుచుకోవాలని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో, ఎంవోయూ లోనూ స్పష్టం చేసింది.ఈ నేపధ్యంలో ప్రభుత్వం పంపిన ఎంవోయూ లపై సంతకం చేస్తే తాము ప్రభుత్వ కబంధహస్తాల్లో చిక్కినట్లే అవుతుందని గుర్తించిన ఎగ్జిబిటర్లు ఈ అంశం పై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
అదే సమయంలో తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సిఎం జగన్ కు లేఖ రాసింది. ఆన్లైన్ విక్రయాలను ఫిలిం ఛాంబర్ ద్వారా నిర్వహిస్తామని.. ఈ విషయంలో పారదర్శకత కావాలంటే ప్రభుత్వానికి దానికి సమబంధించిన లింకు కూడా ఇస్తామని అందులో పేర్కొన్నారు.అంతే తప్ప ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందంపై సంతకాలు చేసేది లేదని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ లు, ఇతర రెవెన్యూ అధికారులు మాత్రం ఎగ్జిబిటర్లు అవగాహన ఒప్పంద పత్రాల పై సంతకాలు చేయాల్సిందే అని, లేని పక్షంలో థియేటర్ లైసెన్స్ లు రద్దు చేస్తామంటూ ఒత్తిడి తెస్తున్నారు. కానీ , ఈ అంశం పై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న ఎగ్జిబిటర్లు అవసరమైతే థియేటర్లు మూసేందుకు కూడా వెనుకాడేది లేదంటూ తేల్చి చెప్తున్నారు.కాగా, మరో రెండు మూడు రోజుల్లో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తో పాటు ఫిల్మ్ ఛాంబర్ కూడా ఈ అంశం పై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ సమావేశం లోనే భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకొనున్నట్లు సమాచారం అందుతోంది.
మొత్తం మీద అంతా సజావుగా సాగుతోంది అనుకున్న సమయంలో జగన్ సర్కార్ ఎంవోయూ పేరిట మరోసారి సినీ పరిశ్రమ పై వేధింపులు మొదలు పెట్టినట్లుగానే కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.