దేశంలోని 20 కోట్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్ తో పాటు, అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. అసలు వ్యవసాయ బిల్లులో ఏముందో చూద్దాం…
వ్యవసాయ బిల్లు రైతులకు మేలు చేస్తుందా? బీజేపీ వాదన ఎలా ఉంది?
పార్లమెంటులో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులు తాము పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు…రైతులు తాము పండించిన పంటను విదేశాలకు కూడా స్వేచ్ఛగా ఎగుమతి చేసుకోవచ్చని బిల్లులో స్పష్టం చేసింది. రైతులు పండించే పంటలను నిత్యావసరాల చట్టం నుంచి తొలగించడం వల్ల రైతులకు మంచి ధర దక్కుందని కేంద్రం బిల్లులో వెల్లడించింది. అయితే వ్యవసాయ బిల్లుపై రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించడంలో బీజేపీ విఫలమైందని చెప్పవచ్చు. బిల్లు ప్రవేశపెట్టే ముందే దీని ప్రయోజలను రైతాంగానికి వివరించాల్సింది. అలా జరగలేదు. దీంతో రైతులకు ఈ బిల్లుపై మరిన్ని అనుమానాలు వస్తున్నాయి.
ప్రతిపక్షాల వాదన ఎలా ఉంది?
వ్యవసాయ బిల్లు అమల్లోకి వస్తే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ తో పాటు, పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. రైతులు పండించే పంటను నిత్యావసరాల నుంచి తొలగిస్తే, కార్పొరేట్ శక్తులు రంగంలోకి దిగుతాయినేది వారి వాదన. దీని వల్ల రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు సరకు కొనుగోలు చేసి, పెద్ద ఎత్తున నిల్వ చేసుకుని బ్లాక్ మార్కెట్ లో ఆ సరకును అధిక ధరలకు విక్రయించే ప్రమాదం ఉందని నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ బిల్లు అమల్లోకి వచ్చాక రైతులు ఇప్పటి వరకు తమ సరుకును అమ్ముకుంటోన్న వ్యవసాయ మార్కెట్లు ఉనికిని కోల్పోతాయని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించే పంటలను నిత్యావసరాల చట్టం నుంచి తొలగిస్తే, కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున నిత్యావసరాలు నిల్వ చేసుకునే వెసులుబాటు వస్తుందని ఇది ప్రమాదకరమని వారు వాదిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతుల నుంచి భూములు లీజుకు తీసుకుని కార్పొరేట్ శక్తులు వ్యవసాయరంగంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని కూడా రైతు సంఘాలు అనుమానిస్తున్నాయి. కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ వేసేందుకే వ్యవసాయ బిల్లు తీసుకువస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
ఎక్కడైనా అమ్ముకోవచ్చు
దేశంలో సగానికిపైగా రైతులు తమ పంటను పొలాల్లో, మరికొందరు ఇంటి వద్దే అమ్ముకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెట్లు కీలకంగా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో రైతులు వ్యవసాయ మార్కెట్లో కుప్పలుగా పోసి ధాన్యం అమ్ముకుంటారు. అదే ఆంధ్రాలో రైతులు పొలాల వద్దే వ్యాపారులకు అమ్మేసుకుంటారు. చాలా మంది రైతులకు తాము పండించిన పంటను ఇంట్లో దాచుకునే సౌకర్యాలు లేవు. దీంతో దక్కిన ధరకు వ్యాపారులకు సరకు అప్పగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతాంగం దేశంలో ఎక్కడికైనా సరకు తీసుకువెళ్లి అమ్ముకోగలరా. అంటే కష్టమేనని చెప్పాలి.
ఇక రైతులు నేరుగా విదేశాలకు పంటలు ఎగుమతి చేయడం చాలా కష్టం. ఈ బిల్లు అమల్లోకి వస్తే వ్యాపారులకు మరింత ప్రయోజనం దక్కుతుంది. రైతులు పండించిన పంటలను నిత్యావసరాల చట్టం నుంచి తొలగిస్తే వ్యాపారులు వారి శక్తి కొలదీ సరకు కొని నిల్వ చేసుకునే వెలుసుబాటు దక్కుతుంది. దీని వల్ల పంట రాగానే రైతుల వద్ద చౌకగా పంటలను కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకుంటారు. వ్యాపారులు, కార్పొరేట్ శక్తులు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, విదేశాలకు కూడా పంటలు ఎగుమతి చేసే అవకాశం ఉంది. దీని వల్ల ఇటు రైతులకు గిట్టుబాటు ధర రాకపోగా, మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమనే ప్రమాదం ఉంది.