ఆర్ఆర్ఆర్ సినిమా మెల్లమెల్లగా వివాదాస్పద సుడిగుండంలో చిక్కుకుంటోంది. ఆ చిత్రంలో కొమురం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ పాత్ర మరింతగా వివాదస్పదం అవుతోంది. కొమురం భీం జయంతి రోజు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర టీజర్‌ను రాజమౌళి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎన్టీఆర్.. ముస్లీం టోపీతో కనిపించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొమురం భీం మనువడు కూడా దీనిపై గతంలో స్పందించారు. అలాగే ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు రాజమౌళిపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కొమురంభీం చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టోపీ అంశంపై దర్శకుడు రాజమౌళిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొమురంభీంకు టోపీ పెట్టడం ఏంటని ఆయన మండిపడ్డారు. రాజమౌళికి నిజంగా దమ్ము, ధైర్యముంటే నిజాం రజాకార్లకు బొట్లు పెట్టి సినిమా తీయాలన్నారు. లేదంటే పాతబస్తీ ముస్లీంకు కాషాయ కండువా వేసి సినిమా తీయాలని సంజయ్ సవాల్ విసిరారు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఎలా విడుదల చేస్తారో చూస్తామని హెచ్చరించారు. జాగ్రత్త మీ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తారు. అంతే కాకుండా బరిషలతో కొట్టి చంపడం కూడా ఖాయమని ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చారు. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని, సినిమా రీళ్లను తగలబెట్టడం కూడా ఖాయమని ఆయన హెచ్చరించారు. రాజమౌళిపై మరికొంతమంది బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు దుబ్బాక ఎన్నికల ప్రచారంలో చేశారు.











