(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రత్యేకప్రతినిధి)
దుర్గగుడి సమీపంలో కొండను ఆనుకుని 2.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మించాలని దశాద్దకాలం కిందట ఉద్యమాలు నడిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించడం సాధ్యం కాదని, ఓ వైపు నది, మరో వైపు కొండ ఉండటంతో నిర్మాణం సాధ్యం కాదని తేల్చారు. అయితే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. కేంద్రంలో బీజేపీ, 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. అప్పట్లో ఎన్డీయేతో టీడీపీ కలసి పనిచేయడంతో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని మరోసారి బుద్దా వెంకన్న ప్రతిపాదించారు.
గతంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దీనిపై నిరసన దీక్ష కూడా చేపట్టారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు దీక్ష శిబిరాన్ని సందర్శించి అధికారంలోకి రాగానే ఫ్లైఓవర్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఈ ఫ్లైఓవర్ తీసుకురావడంలో కీలకంగా పనిచేశారు. అప్పటి కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీతో ఎంపీ కేశినేనికి మంచి సంబంధాలు ఉండటంతో బెంజి సర్కిల్ ప్లైఓవర్, దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వెంటనే అంచనాలు వేసి పనులు ప్రారంభించారు. అయితే దుర్గగుడి ఫ్లైఓవర్ 18 నెలల కాలంలో పూర్తి చేసి 2016 కృష్ణా పుష్కరాల నాటికి అందిస్తామని సోమా కంపెనీ హామీ ఇచ్చింది. అయితే పనులు చురుగ్గా సాగలేదు. చాలా క్రిటికల్ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించాల్సి రావడంతో అంచనాలు తారుమారు అయ్యాయి. దీంతో దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు దాదాపు 60 నెలల కాలం పాటు సాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయింది. మరో రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు.
అంతా బాగానే ఉంది అయితే ఇక్కడే సమస్య వచ్చి పడింది. దుర్గగుడి ఫ్లైఓవర్‌ను పరిశీలించిన మంత్రి వెల్లంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు నగరంలో దుమారం రేపాయి. చంద్రబాబు 5 సంవత్సరాల్లో చేయలేని పనిని సీఎం జగన్మోహన్ రెడ్డి 14 నెలల్లో చేసి చూపించారని మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ వర్గాలు భగ్గుమన్నాయి. వెంటనే టీడీపీ ఎమ్మెల్సీ వెంకన్న రంగంలోకి దిగారు. ప్రెస్ మీట్ పెట్టి దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం తాము చేసిన ఉద్యమాలను గుర్తుచేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని కృషి కూడా మరవలేమని బుద్దా వెంకన్న గుర్తుచేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ ను సీఎం జగన్ పూర్తి చేశారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి.
మరో రెండు రోజుల్లో అన్ని పరీక్షలు నిర్వహించి దుర్గగుడి ఫ్లైఓవర్‌ను సిద్దం చేయనున్నారు. దీని ప్రారంభానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మరో వివాదం కూడా పొంచి ఉంది దుర్గగుడి ఫ్లైఓవర్ కు కనకదుర్గమ్మ పేరు పెట్టాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. వైసీపీ నాయకులు మాత్రం దివంగత నేత వైఎస్ఆర్ పేరు పెట్టాలని భావిస్తున్నారు. ఇది మరో వివాదానికి దారి తీయనుంది. ఏది ఏమైనా విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు కొంత మేర తొలగిపోయే అవకాశం ఉండటం ఇక్కడ ఊరట కలిగించే అంశం.











