భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న,ఇటీవల మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ పలువురు రాజకీయనాయకులతో భేటీ అవుతున్న నేపథ్యంలో ఈటల నెక్ట్ స్టెప్ ఏంటనే అంశంపై చర్చ నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు,ఏ పార్టీలో లేకుండా తటస్థంగా ఉన్న నేతలతోపాటు టీఆర్ఎస్‌లోని అసమ్మతి నేతలుగా ఉన్న డీఎస్ లాంటివారిని కూడా కలిశారు ఈటల రాజేందర్. దీంతో ఆ భేటీలపై ప్రాధాన్యం సంతరించుకుంది.
నాయకులు, తన అనుచరులతో సమావేశం
కేబినెట్ నుంచి తొలగించిన తరవాత ఈటల తనతో పాటు వచ్చే కొందరు నాయకులు,తన అనుచరులతో సమావేశమయ్యారు.ప్రభుత్వ నిఘా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఫోన్లల్లోనూ కొన్ని సంప్రదింపులు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. తరవాత సీనియర్ రాజకీయ నాయకులు,ఇతర పార్టీల లీడర్లతో సమావేశమయ్యారు.మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ,మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డితో పాటు పలువురిని కలిశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క,తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ జేఏసీ కీలక నేత, మండలి మాజీ చైర్మన్, బీజేపీ నేత స్వామి గౌడ్,రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్,మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి,జితేందర్ రెడ్డిని కలిసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.బీజేపీలోని మరికొందరు కీలక లీడర్లను కలిసినట్టు ప్రచారం జరుగుతున్నాఈటల వర్గం ఆ ప్రచారాన్ని ఖండిస్తోంది.ఇక గురువారం ఈటల కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆడియో విడుదల చేసినట్టుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో తన నియోజకవర్గంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆదుకోవడంతోపాటు కొవిడ్ నుంచి బయటపడేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను చూస్తున్నామని,కొవిడ్ నియంత్రణకే మొదటి ప్రాధాన్యమని ఆ ఆడియో సారాంశంగా చెబుతున్నారు. కొవిడ్ పూర్తిగా తగ్గాకే రాజకీయాలు మాట్లాడతానని, కచ్చితంగా రాజకీయం చేస్తానని వ్యాఖ్యానించారు.
వ్యూహం సిద్ధమైందా..
ఈటల విషయంలో అప్రకటితంగా ఆర్థికంగా,సామాజికంగా,నియోజకవర్గ పరంగా పార్టీ పరంగా అన్ని రకాలు దిగ్బంధిస్తోందని,నిఘా పెట్టిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈటల వ్యూహం ఏంటనే చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.ఇప్పటికిప్పుడు ప్రకటనలు చేసి హడావుడి చేస్తే ఉపయోగం ఉండదని, ఉద్యమకాలం నుంచి తనతో ఉన్నవారు ఎప్పటికీ అభిమానిస్తారని ఈటల భావిస్తున్నారని సమాచారం.పార్టీపరంగా సస్పెండ్ చేసేవరకు ఎదురుచూసి తరువాత పోరాటం మొదలుపెడితేనే ఉపయోగం ఉంటుందని కొన్ని సూచనలు వచ్చిన నేపథ్యంలో అప్పటిలోగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ ఉద్యమకాలం నుంచి ప్రజలు తన పట్ల విశ్వాసంతో ఉన్నారని,పార్టీలకు అతీతంగా తనను అభిమానించేవారు ఉన్నారని,అందులో భాగంగానే ఈ భేటీలు జరుగుతున్నాయని చెబుతున్నట్లు సమాచారం.పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదా అనర్హత వేటు పడే సందర్భాలు వస్తే ఇండిపెండెంట్‌గా పోటీచేసేందుకే ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.ఇంకా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.అదే సమయంలో కొత్త పార్టీల భవిష్యత్తు ఆయా సందర్భాలపై,పార్టీ నడుపుతున్న వ్యక్తులపై, ప్రజల్లో ఉన్న విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని కూడా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
పార్టీల్లోనూ అంతర్మథనం..
కాగా ఈటలతో కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు నాయకులు భేటీ అవుతున్నా..పార్టీల పరంగా స్టాండ్ ఏంటనే చర్చ తెరపైకి వచ్చింది. బీజేపీకి చెందిన పలువురు నేతలతో ఈటల భేటీ అయినట్టు చెబుతున్నా ఈటల విషయంలో జాతీయ స్థాయి నాయకత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలతో ఈటల భేటీ అయ్యారు.కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఇప్పటికే ఈటలకు మద్దతు పలికారు.టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఈటలకు పరోక్ష మద్దతు పలకడంతోపాటు ప్రభుత్వంలోని పెద్దలపై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్నారు.అదే సమయంలో క్షేత్రస్థాయిలో హుజూరాబాద్‌లో ఈటలతో గతంలో పోటీపడిన పాడి కౌశిక్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కె.సత్యనారాయణలు మాత్రం ఈటలను విమర్శిస్తున్నారు. కౌశిక్‌రెడ్డి ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గరి బంధువు.. స్వయానా తమ్ముడు. ఈ నేపథ్యంలో ఈటల విషయంలో టీపీసీసీ చీఫ్ ఎలా వ్యవహరిస్తారనేది తేలాల్సి ఉంది.ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈటలతో మాట్లాడవద్దని కాని, మాట్లాడాలని కాని పార్టీలు ఎలాంటి సూచనలూ చేయకపోవడాన్ని గమనించవచ్చు. అదే సమయంలో ఈటల రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను నిలబెడతాయా లేక ఈటల వెంట ఉంటాయా, ఒకవేళ అదే పరిస్థితి తలెత్తితే ఇప్పటి వరకు అక్కడ ఈటలకు పోటీగా పనిచేసిన వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా తేలాల్సి ఉంది.