విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో దశాబ్దాల పాటు ఉద్యమపోరు నడిపి సాధించుకున్న ఉక్కు కంపెనీ.. తెలుగు వారి పోరాట పటిమకు గుర్తు. అలాంటి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారిగా ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. కార్మిక సంఘాల నుండి పార్టీ నాయకుల సైతం పోరుబాట పట్టారు. అందులో భాగంగా నేడు స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ వద్ద అన్ని కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి.
సమావేశమైన కార్మిక సంఘాలు.. ఉద్యమంలో చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణ గురించి చర్చించనున్నారు. కార్మిక సంఘాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వామ పక్ష పార్టీలు మద్దతు తెలిపారు. సమావేశం సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 22 వేల ఎకరాలు త్యాగం చేసిన వారిని గుర్తు చేసుకున్నారు కార్మికులు, నాయకులు. అంతేకాదు.. స్టీల్ ప్లాంట్ కోసం తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడిన త్యాగమూర్తులను గుర్తు చేసుకుని ఉద్వేగభరితంగా మాట్లాడారు కార్మికులు.
కొన్ని దశాబ్దాలుగా సొంత గనులు లేకపోయినా ప్లాంట్ అభివృద్ధి కోసం వేలాది మంది కార్మికులు కష్టపడ్డారని.. ఈనాడు వారి కష్టం ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీరుగా మారునుందని చెప్పుకొచ్చారు. ఆనాడు ఆంధ్రుల హక్కును సాధించుకోవడానికి ఉద్యమ బాట పట్టారు.. నేడు అందరూ కలసికట్టుగా ఆనాడు వారు మన కోసం సాధించిన ఈ ఆంధ్రుల హక్కును కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్రేకపూరితంగా ప్రసగించారు.