జగన్ పాలనలో చోటుచేసుకున్న తొలి విధ్వంసం “ప్రజా వేదిక” కూల్చివేతకు నేటితో మూడేళ్లు నిండుకుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ విధ్వంస పాలన పై టిడిపి జాతీయ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. తన విధ్వంస పాలన ఎలా ఉండబోతోందో జగన్ ప్రజలకు చూపించడం మొదలుపెట్టి నేటికి మూడేళ్లు అవుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి మొట్ట మొదట కోట్ల విలువైన ప్రజల ఆస్తి అయిన పని ప్రజావేదికను కూల్చివేశాడని మండిపడ్డారు.
డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ చేతగాని జగన్ చేసినవన్నీ కూల్చివేతలేనని.. ఆయన రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని, ఆర్థిక పరిస్థితిని, దళితుల గూడును, ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాష్ట్ర యువత భవిష్యత్తును.. ఇలా అన్నింటినీ కూల్చేశిన జగన్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
ప్రజలు కోరుకున్న అమరావతి రాజధాని కలలను, పోలవరం కలను కూల్చి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆక్షేపించారు. జగన్ ఈ మూడేళ్లలో కట్టినది ఏమీ లేదని, అంతా శూన్యమని మండిపడ్డారు. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన కొనసాగిస్తున్నారని.. తన వల్ల ఏమీ జరగదని, తనకేమీ రాదని తేలిపోయిందని.. కూల్చడం కంటే నిర్మించడం ఎంత కష్టమైన పనో మూడేళ్ల పాలన తరువాత అయినా జగన్ తెలుసుకోవాలి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జగన్ కళ్లు తెరవాలని చంద్రబాబు ట్విటర్ వేదికగా జగన్ కు హితవు పలికారు.