కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది.ఏపీ,తెలంగాణ సరిహద్దులను మూసివేసింది.కేవలం ఈ పాస్ ఉన్న వారిని మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.అంబులెన్సులను యథావిధిగా అనుమతిస్తున్నారు.ఇక ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఉండటంతో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు జిల్లాలకు ప్రజలు కార్లలో పెద్ద ఎత్తున బయలు దేరారు.వీరిలో ఈ పాస్ ఉన్న వారిని మాత్రమే ఏపీలోకి అనుమతించి మిగిలిన వారిని చెక్ పోస్టుల వద్ద నుంచి వెనక్కు పంపించి వేశారు.దీంతో సరిహద్దుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ముందస్తు సమాచారం లేకుండా..
లాక్ డౌన్ సడలింపు వేళ్లల్లో తెలంగాణ నుంచి ఏపీ,ఏపీ నుంచి తెలంగాణకు ప్రయాణం చేయవచ్చని ప్రజలు భావిస్తున్నారు.గడచిన పదిహేను రోజులుగా అలాగే తిరుగుతున్నారు.తాజాగా అత్యవసర సర్వీసులు మినహా అన్ని వాహనాలకు సరిహద్దుల వద్ద పోలీసులు నిలిపి వేస్తున్నారు.కేవలం ఈ పాస్ ఉన్న వారిని మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు.దీంతో సరిహద్దుల వద్ద గందరగోళం నెలకొంది.జగ్గయ్యపేట రామాపురం వద్ద ఈ ఉదయం పోలీసులకు,ప్రయాణీకుల మధ్య వివాదం చెలరేగింది.లాక్ డౌన్ సడలింపు వేళ్లల్లో ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను నిలదీశారు.అయినా ప్రయోజనం లేకుండా పోయింది.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ముందే మీడియాలో ప్రచారం చేసి ఉంటే ఇంత మంది రోడ్ల మీదకు వచ్చే వారు కాదు.సరిహద్దుల వద్ద వందల సంఖ్యలో కార్లు, జనం పోగుబడటంతో ఇక్కడ కూడా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రయాణీకులు వాపోతున్నారు.











