ప్రజల మధ్యకు వచ్చేందుకు జగన్ భయపడుతున్నారా ? సిఎం సభలకు జనం ఎందుకు రావడం లేదు ? వచ్చిన వారు మధ్యలో పారిపోతుండడంతో కొత్త వ్యూహాలు రచిస్తున్నారా ? సిక్కోలు ముఖ్యమంత్రి పర్యటనకు అధికార పార్టీ చేస్తున్న సన్నాహాలు ఏమిటి ? గతంలో ఎన్నడూ లేని విధంగా సిఎం సభలకు ఆంక్షలు విధించడం వెనుక మర్మం ఏమిటి ?
ఒకప్పుడు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు అంటే ఎంతో సందడి సందడిగా ఉండేది.మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ,జిల్లా నాయకులు, జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చే జనం, మీడియా ఇలా సభ మొత్తం కిక్కిరిసిపోయి జాతరలా కనిపించేది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మొత్తం మారిపోయాయట.సిఎం సభలకు జనం రావడం లేదట. వచ్చినా జగన్ ప్రసంగం మొదలవుతూనే అంతా సభ నుంచి బయటకు పారిపోతున్నారట.దీంతో తలలు పట్టుకుంటున్న అధికార పార్టీ నాయకత్వం సిఎం సభలకు కొత్త వ్యూహాలు రచిస్తోందట.
ఈ నెల 27 వ తేదీన సిఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. అమ్మఒడి మూడవ ఫేజ్ కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సభ నిర్వహణకు సంబంధించి జిల్లాలోని మంత్రులు, అధికార పార్టీ నాయకులు , అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని జిల్లాల్లో సిఎం జగన్ సభలో నుంచి ప్రజలు పారిపోతుండడంతో వైసీపీ కేడర్‌లోకి వ్యతిరేక సంకేతాలు పోతుండడంతో సీఎం సభకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారట.
ప్రధానంగా జగన్ సభకు సంబంధించి పారిపోయే జనాలు, నిలదీసే జనాలు అంటూ కేటగిరీల వారీగా విభజించి.. వారి పట్ల ఎలా వ్యవహరించాలో వ్యూహం సిద్ధం చేశారని టాక్. ఏమైనా పథకాలు అందని వారు ఉంటే అటువంటి వారు సభకి రాకుండా సంబంధిత వాలంటీర్ నుంచి ఆ శాఖాధికారుల వరకూ బాధ్యతలు తీసుకోవాలని గట్టిగా చెప్పారని సమాచారం.కేవలం ఎటువంటి నిరసన తెలియజేయని లబ్ధిదారుల్ని మాత్రమే సభకి తరలించాలనే ఆదేశాలు జారీ చేశారట.ఇక పెయిడ్ జనాన్ని తరలించడంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, వారు సభ మధ్యలో వెళ్లిపోవడమో, నిలదీయడమో చేసే అవకాశం లేకుండా ముందుజాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టంగా చెబుతున్నారట.ఒకవేళ ఎవరైనా వైసీపీ పాలనకి వ్యతిరేకంగా మాట్లాడితే…టిడిపి వాళ్లనే ముద్రవేసేయాలని చెబుతున్నారట.అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సభకు అనేక ఆంక్షలు కూడా విధిస్తున్నారట.
ముఖ్యంగా టెన్త్, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు సభలోకి అనుమతి ఇవ్వకూడదని హుకుం జారీ చేసిన వైసీపీ మంత్రులు.. సీఎంతో మాట్లాడేవారు విద్యార్థులైనా, వారి తల్లిదండ్రులైనా వైసీపీ వాళ్లయి వుండాలని, వారికి ముందుగానే శిక్షణ ఇవ్వాలని ఆదేశాలిచ్చారట.ఇక సిఎం సభ కవరేజ్ చేసే మీడియా విషయంలోనూ ఆంక్షలు విధించారట. సభకు కెమెరాలను అనుమతించకూడదని, సెల్ ఫోన్ లలో కూడా ఎవరూ రికార్డు చేయకూడదని, అలా కాదని ఎవరైనా సెల్ ఫోన్ లలో చిత్రీకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు విధించారట. ఇంటెలిజెన్స్ అధికారులతో సభా ప్రాంగణం మొత్తం ప్రత్యేక నిఘా పెట్టి సభను ఎలాగైనా కానిచ్చేయాలని చూస్తున్నారట.
మొత్తం మీద జగన్ కి జనం తన పాలనపై వ్యతిరేకతతో తిరగబడుతున్నారనే భయం పట్టుకుందని సిక్కోలు సభ ఏర్పాట్లతో అది స్పష్టమవుతోందని పరిశీలకులు చర్చించుకుంటున్నారు. ప్రజావ్యతిరేకత స్థాయిని మించినప్పుడు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా…ఏదో ఒక నోరు లేస్తుందని.. ఎన్ని బారికేడ్లు పెట్టినా..ఎంతగా అడ్డుకునే ప్రయత్నాలు చేసినా..జగన్ ప్రసంగాలంటే మొహం మొత్తిన జనం పారిపోవడం ఆపలేరని.. ఇదే కొనసాగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి శ్రీకాకుళం జల్లాలో జగన్ సభ ఎలా జరగబోతోందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..