సీనియర్ రాజకీయ వేత్త, సీనియర్ ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వర రావు గుండెపోటుకు గురయ్యారు. ఉన్నట్టుండి అస్వస్థతకు గురైన దగ్గుబాటిని కుటుంబ సభ్యులు హుటాహుటిని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. దగ్గుబాటికి తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లు చికిత్స అందించిన వైద్యులు పేర్కొన్నారు.అనంతరం ఆయనకు స్టెంట్ వేశారు.
ప్రస్తుతం దగ్గుబాటి వేంకటేశ్వర రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయనను ఆసుపత్రికి తరలించే సమయం నుంచి వైద్యం పూర్తి అయ్యే వరకు ఆయన భార్య దగ్గుబాటి పురందరేశ్వరి, మరి కొందరు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోనే ఉన్నారు. దగ్గుబాటి వేంకటేశ్వర రావుకు అపాయం తప్పిందని వైద్యులు ప్రకటించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్న చంద్రబాబు, దగ్గుబాటితో ఆయన కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు.దగ్గుబాటి త్వరగా కోలుకుని మామూలు స్థితికి వేగంగా రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.