తెలుగు తెరకి గ్లామర్ టచ్ ఇచ్చి తమ సత్తాను చాటుకోవాలనే కసితో, ఈ మధ్య కాలంలో కొంతమంది యువ కథానాయికలు రంగంలోకి దిగారు. వాళ్లు ఒకటి .. రెండు సినిమాలు చేసేసి, తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుండగా పిడుగుపాటులా ‘లాక్ డౌన్’ వచ్చిపడింది. చేసిన సినిమాలు విడుదలకి నోచుకోకపోవడం వలన, వాళ్లంతా డీలాపడిపోయారు. తమ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వెళితే కొత్తగా అవకాశాలు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాలు బాగా ఆడితే తమ దశ తిరుగుతుందనే నమ్మకంతో ఉన్నారు. అలాంటి కథానాయికల జాబితాలో ‘ప్రియాంక జవాల్కర్’ కూడా కనిపిస్తోంది.
ప్రియాంక జవాల్కర్ పేరు వినగానే ‘టాక్సీవాలా’ పేరు గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆమె చాలా గ్లామరస్ గా కనిపించింది. నాజూకుగా కనిపిస్తున్న ఈ ‘నందివర్ధనం’ ఎవరబ్బా? అని కుర్రకారు కళ్లప్పగించి చూస్తుండిపోయారు. విజయ్ దేవరకొండ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సుందరి వరుస అవకాశాలను తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. తమన్నా తరువాత ఆ స్థాయి స్కిన్ టోన్ తో కనిపించే ఈ అమ్మాయి, కుర్ర హీరోల జోడీగా ఒక రేంజ్ లో సందడి చేస్తుందని భావించారు. మిగతా కథానాయికలకు గట్టిపోటీ ఇస్తుందని ఆశించారు.
అయితే అందరూ ఊహించినట్టు ఈ అజంతా శిల్పం అంత బిజీగానూ లేదు .. అలా అని చెప్పేసి ఖాళీగాను లేదు. క్రితం ఏడాది ఈ అమ్మాయి ఎలాంటి హడావిడి లేకుండానే రెండు సినిమాలు చేసింది. ఒకటి ‘గమనం’ అయితే మరొకటి ‘తిమ్మరుసు’. ఈ రెండు సినిమాలు చిత్రీకరణ పూర్తిచేసుకుని విడుదలకి ముస్తాబవుతున్నాయి. సుజనారావు దర్శకత్వం వహించిన ‘గమనం’ సినిమాలో ప్రియాంక జవాల్కర్ వైవిధ్యభరితమైన పాత్రలో నటించింది. వాస్తవ జీవితాలను ప్రతిబింబించే కథాకథనాలతో .. సహజంగా మలచబడిన పాత్రలతో రూపొందిన ఈ సినిమాపై ప్రియాంక జవాల్కర్ భారీగానే ఆశలు పెట్టుకుంది.
ఇక ‘తిమ్మరుసు’ సినిమాలో ఆమె సత్యదేవ్ జోడీగా కనిపించనుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, ఈ నెల 9వ తేదీన టీజర్ రిలీజ్ కానుంది. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాపై కూడా ప్రియాంక జవాల్కర్ గట్టి నమ్మకమే పెట్టుకుంది. ఈ సినిమాపై అంచనాలు పెరగడం .. ఆమెలో ఆసక్తి పెరగడానికి కారణమవుతున్నాయి. లాక్ డౌన్ తరువాత ఈ అమ్మాయిని సంప్రదిస్తున్న దర్శక నిర్మాతల సంఖ్య ఎక్కువగానే ఉందట. లాక్ డౌన్ సమయంలో ఆమె కొన్ని కథలను వినడం జరిగిపోయిందని అంటున్నారు. త్వరలో విడుదల కానున్న రెండు సినిమాలతో, ఈ సుందరి దశ తిరుగుతుందేమో చూడాలి.
Must Read ;- బుల్లితెరపై వెలిగిపోతున్న అందాల చందమామ











