టీడీపీ నేతృత్వంలోని కూటమి పాలన మొదలు కాగానే ఒక్కసారిగా ఏపీ భవిష్యత్తే మారిపోయింది. అప్పటిదాకా ఏపీ వైపు కన్నెత్తి చూడాలంటేనే దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు హడలెత్తిపోయాయి. నాడు వైసీపీ జమానాలో జగన్ అండ్ కో సాగించిన దౌర్జన్య కాండనే ఇందుకు కారణమని స్వయంగా ఆయా కంపెనీల యాజమాన్యాలే బహాటంగా ఆరోపణలు గుప్పించాయి. అయితే ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి పాలన మొదలు కాగానే… పారిశ్రామికవేత్తల్లోని సదరు భయాలు పటాపంచలయ్యాయి. ఏపీలో ఉన్న అపారమైన వాణిజ్య, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆయా కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఈ కంపెనీలకు ఇప్పుడు ఫారిన్ కంపెనీలు కూడా తోడయ్యాయి.
దేశంలోని అత్యంత పొడవైన తీరం ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వెరసి ఏపీకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా చమురు శుద్ధి రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న సౌదీ అరాంకో ఏపీలో ఏకంగా రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ దిశగా సదరు కంపెనీ అటు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చలు మొదలుపెట్టింది.
ఏపీలో అందుబాటులో ఉన్న పొడవైన తీర ప్రాంతం… ఆ తీరం వెంట ఇటీవలి కాలంలో వరుసబెట్టి అందుబాటులోకి వచ్చిన పోర్టులు… రాష్ట్ర రూపు రేఖలను మార్చివేశాయని చెప్పక తప్పదు. ఈ క్రమంలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏపీలో ఓ భారీ చమురు శుద్ధి క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని తలచింది. అందుకోసం ఇప్పటికే ఈ కంపెనీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటుగా సదరు ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం అవసరమైన ప్రాథమిక చర్యలను ప్రారంభించింది. ఇందుకోసం సదరు కంపెనీ రూ.6,100 కోట్లతో పనులు మొదలుపెట్టేసింది.
బీపీసీఎల్ తో జత కట్టి… ఏపీలో భారీ ఆయిల్ రీఫైనరీని ఏర్పాటు చేయాలని సౌదీ అరాంకో భావిస్తోంది. నెల్లూరు జిల్లా పరిధిలోని రామాయంపట్నం పోర్టు సమీపంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని సదరు కంపెనీ తలపోస్తున్నట్లుగా సమాచారం. ఇందుకోసం సదరు కంపెనీ ఏకంగా రూ.1 లక్ష కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధపడినట్లుగా కూడా సమాచారం. ఈ ప్రాజెక్టులో ఆయిల్ రిఫైనరీతో పాటుగా పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసే దిశగా ౌదీ అరాంకో భావిస్తోంది.
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న నిరవధిక యుద్ధం నేపథ్యంలో… భారత్ కు రష్యా అత్యంత చవకగా చమురును అందజేస్తోంది. ఇలా రష్యా అందిస్తున్న చమురు అరబ్ దేశాల మీదుగానే భారత్ కు వస్తోంది. ఈ పరిస్థితులను లోతుగా పరిశీలించిన సౌదీ అరాంకో… భారత్ కు తామే మరింత మేర చమురును అందిస్తే సరిపోతుంది కదా అన్న దిశగా యోచించింది. అనుకున్న వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సదరు సంస్థ సంప్రదింపులను మొదలుపెట్టింది. ఈ విషయాన్ని పసిగట్టిన మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లు బీపీసీఎల్ తో కలిసిసౌదీ అరాంకో చేపట్టనున్న రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఎగురవేసేకునిపోయేందుకు యత్నించాయి.
అదే సమయంలో ఏపీ తరఫున సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా రంగంలోకి దిగిపోయారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో పాటుగా బీపీసీఎల్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూనే… మరోవైపు సౌదీ అరాంకోతో కూడా నెగోషియేషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఏపీలో ఉన్న తీరం, దాని పొడవునా ఏర్పాటైన పోర్టులను చంద్రబాబు.. అరాంకో ప్రతినిధుల ముందు పెట్టారు. చంద్రబాబు ప్రతిపాదనలకు ఫిదా అయిన అరాంకో… తమ వెంచర్ ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు తీర్మానించారు.
ఏపీ వైపు అరాంకో ఆసక్తి చూపే విషయంలో చంద్రబాబు నడిపిన మంత్రాంగంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. అరాంకో ప్రాజెక్టును ఎగురవేసేకుని పోయేందుకు రంగంలోకి దిగిన మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లు రెండూ ఏపీ కంటే బలమైన రాష్ట్రాలే. మహారాష్ట్రలో ఏపీ మాదిరే కూటమి సర్కారే ఉన్నా… ఉత్తర ప్రదేశ్ లో మాత్రం బీజేపీ సర్కారే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ పాలిత రాష్ట్రం యూపీకే ఈ ప్రాజెక్టు వెళుతుందన్న వాదనలు వినిపించాయి. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ… చంద్రబాబు తనదైన శైలి మంత్రాంగం నడిపారు. కేంద్రంలోని పెద్దలతో పాటుగా బీపీసీఎల్ ప్రతినిధులతో నిత్యం సంప్రదింపులు జరిపిన చంద్రబాబు… విభజన నేపథ్యంలో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి అరాంకో లాంటి కంపెనీ వచ్చిందంటే… రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని,ఆ దిశగా తమకు సహకరించాాలని కూడా చంద్రబాబు వారిని కోరారు.
ఈ ప్రతిపాదనలకు మోదీ సర్కారుతో పాటు బీపీసీఎల్ కూడా మెత్తబడిపోగా… అప్పటికే అరాంకో ప్రతినిధులను కూడా ఏపీ వైపు చేసేలా చేయడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారు. ఫలితంగా రెండు బలమైన రాష్ట్రాలను వెనక్కు నెట్టేసి… ఏపీకి అరాంకోను చంద్రబాబు తీసుకొచ్చారు. అరాంకో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో త్వరలోనే సౌదీలో పర్యటించనున్న చంద్రబాబు అరాంకో ప్రతినిధి బృందంతో భేటీ కానున్నట్లు సమాచారం. ఆ సమయంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయి.