గతంలో పోటీబడి అభివృద్ధి పరుగులు..ఇప్పుడీ 4ఏళ్లలో హింసా విధ్వంసాలు
పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్న దుష్ఫలితాలు..
విజన్ ఉన్న పాలకుడికి, అదిలేని అసమర్ధుడికి ఎంత తేడా..?
2014జూన్ 2 తెలుగుజాతి చరిత్రలో కీలకదినం. తెలంగాణ అపాయింటెడ్ డే..ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన రోజు, అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా ఇక్కడ ఉత్సవాలు, అక్కడేమో నిర్వేదం..ఇప్పటికి 10ఏళ్లు గడిచాయి..ఈ దశాబ్దకాలంలో రెండు రాష్ట్రాల ప్రగతిని బేరీజు వేసుకోవాల్సిన రోజు, సమీక్షించుకోవాల్సిన దినం..
ఏ లక్ష్యం కోసమైతే ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవాలని కోరుకున్నారో ఆ లక్ష్యం సిద్ధించిందా అని తెలంగాణ ప్రజానీకంలో అసంఖ్యక ప్రశ్నలు..అటు హైదరాబాద్ ను కోల్పోయి, ఇటు రాజధాని లేక పదేళ్లుగా పడుతూలేస్తున్న ఆంధ్రప్రదేశ్ మళ్లీ లేచేదెన్నడు, కోలుకునేదెప్పుడు, ప్రగతిబాటలో పరుగులు తీయగలదా అనే సందేహాలెన్నో అక్కడి ప్రజల్లో..
సంపన్న రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో పదేళ్ల ప్రగతిని సమీక్షిస్తే సంతృప్తి అంతంతే..‘‘నీళ్లు-నిధులు-నియామకాలే’’ నినాదంగా తెలంగాణ ఉద్యమం హోరెత్తింది..ఈ 10ఏళ్లలో ఆ మూడింటినీ సాకారం చేశారా అంటే సమాధానం లేదు, రాదు. పొరుగు రాష్ట్రాలతో నీళ్ల పంచాయతీలు తెగిందీలేదు, కృష్ణా గోదావరి రివర్ బోర్డులు పేరుకేగాని, వాటితో ఏ సమస్యా పరిష్కరించిన దాఖలా లేదీ పదేళ్లలో..విభజన హామీలు నెరవేర్చడంలో ఉభయ రాష్ట్రాల మధ్య పెద్దన్నపాత్ర పోషించాల్సిన కేంద్రం జోక్యం గుండుసున్నానే..రూ లక్షల కోట్లు వ్యయం చేసిన కాళేశ్వరం, మిషన్ భగీరథ పై ప్రశంసలెన్నో, విమర్శలూ అన్నే..ఇక నిధుల విషయంలో కేంద్రంతో వైరం పెద్ద అడ్డంకైంది. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం మోకాలడ్డుతోందని సీఎం కేసిఆరే ధ్వజమెత్తడం కద్దు..అంటే నిధులు రాబట్టడంలో 9ఏళ్ల వైఫల్యం కళ్లముందే ఉంది. నియామకాల్లో వెనుదిరిగి చూస్తే సాధించింది శూన్యమే..కంటితుడుపు నోటిఫికేషన్లే తప్ప, ఇంతవరకు నియామకాల్లేకపోగా, టిపిఎస్ సి క్వశ్చన్ పేపర్ల లీకేజి మాయనిమచ్చే..బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రంలో ఇంకా ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడకపోవడం మరో కళంకం, నిరుద్యోగుల ఆత్మహత్యలు, విద్యార్ధుల ఆత్మహత్యలు, ధాన్యం కుప్పలపై పడి రైతుల మరణాలు కొత్తరాష్ట్రం తెలంగాణలో ఎవరూ కోరుకున్నవికాదు..ఇక అవినీతి ఆరోపణల సంగతి సరేసరి, సాక్షాత్తూ సీఎం కేసిఆర్ కుమార్తె కవిత పేరు ఢిల్లీ మద్యం స్కామ్ ఈడి ఛార్జిషీట్లలో ప్రస్తావించడం తెలిసిందే..
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఈ 9ఏళ్ల ప్రయాణాన్ని రెండుగా చూడాలి. 5ఏళ్ల టిడిపి పాలన, 4ఏళ్ల వైసిపి పాలనలో వెలుగుచీకట్లే..చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొదటి 5ఏళ్లలో ఒక పోటీతత్వంతో పరుగులు తీశారు. జూన్ 2న ‘‘నవ నిర్మాణ దీక్ష’’గా, జూన్ 8న(సిఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ రోజు)‘‘మహా సంకల్పం’’గా జరిపేవారు. తెలంగాణతోనే కాదు, దేశంలో ఇతర రాష్ట్రాలతో పోటీబడి అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించారు. తెలంగాణలో ఉద్యోగులకు 42%ఫిట్ మెంట్ ఇస్తే ఏపిలో 43% ఇవ్వడం, తెలంగాణలో రైతులకు రూ లక్ష రుణమాఫీ చేస్తే, ఏపిలో రూ లక్షన్నర చేయడం, పించన్లు 10రెట్లు పెంచడం, పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి అన్నింటిలో పోటీతత్వంతో ముందుకెళ్లారు..
దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు హాజరు దగ్గరనుంచి అమెరికా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, చైనా, మలేషియా, బ్రిటన్ తదితర దేశాల్లో పర్యటించి, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు జరిపి, ఏపికి ఉన్న వనరులు వివరించి, భారీఎత్తున పెట్టుబడులు రాబట్టడంలో ఇతర రాష్ట్రాలతో పోటీబడి ఏపిని ప్రగతిబాట పట్టించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. విశాఖపట్నంలో 5ఏళ్లలో 3 అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులు(సమ్మిట్లు) నిర్వహించారు, రూ 15లక్షల కోట్ల పెట్టుబడులతో 30లక్షల ఉద్యోగాలు కల్పించేలా ఎంవోయూలను చేసుకున్నారు. కన్వర్షన్ రేటు కర్ణాటకలో 3.8%, గుజరాత్ లో 15%ఉంటే, ఏపిలో 48% కన్వర్షన్ రేటు, 42% ఇన్వెస్ట్ మెంట్ రేటు సాధించడం అప్పటి చంద్రబాబు ప్రభుత్వ సామర్ధ్యమే..
దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్ డిఐ) కియా కార్ల ఇండస్ట్రీ అనంతపురం జిల్లా పెనుగొండలో నెలకొల్పేలా చేయడం చంద్రబాబు ప్రభుత్వ ఘనతే..ఇసుజు, హీరో, అశోక్ లేలాండ్ వంటి కంపెనీలు అనేకం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి, ఆటోమొబైల్ హబ్ గా ఏపిని చేశారు. విశాఖలో ఫిన్ టెక్ ఫెస్టివల్, అగ్రి హ్యాకథాన్ నిర్వహణ ద్వారా ‘‘పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపిని’’ మార్చేందుకెంతో శ్రమించారు. 2017లో 3రోజులపాటు జరిగిన అగ్రి హ్యాకథాన్ కు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ రావడం ఏపితో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం విదితమే..
వైసిపి 4ఏళ్లలో ఒక్క సమ్మిట్ జరపలేదు, ఎన్నికల ఏడాదిలో జరిపిన విశాఖ సమ్మిట్ కూడా మొక్కుబడి ప్రయత్నమే తప్ప దానివల్ల ఒనగూడింది శూన్యం. దావోస్ సదస్సుకెళ్లిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ కంపెనీని ఏపికి తేలేకపోగా, ఏ పారిశ్రామికవేత్తను ఆకర్షించలేక పోగా ఆయన కలిసిన ఒకళ్లిద్దరు (శరత్ చంద్రారెడ్డి తదితరులు) కుంభకోణాల్లో జైళ్లకు వెళ్లడం తెలిసిందే..అడపా దడపా చేసిన విదేశీ పర్యటనలు కూడా సొంతానికో, కుటుంబం కోసమో, మొక్కులు తీర్చుకోడానికో తప్ప రాష్ట్రానికి మేలు చేయడానికి కాదు..
చంద్రబాబు ప్రభుత్వం 5ఏళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10లక్షలమందికి పైగా ఉపాధి కల్పించగా, గత 4ఏళ్లలో ఏపి నుంచి బెదిరి పారిపోయిన కంపెనీలే అధికం..సింగపూర్ కన్సార్షియం, లులూ గ్రూప్, జాకీ, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, ఫాక్స్ కాన్, అమర్ రాజా, కియా ఆగ్జిలరీ ఇండస్ట్రీలతో సహా అనేకమందిని వాటాల కోసం బెదిరించి తరమేశారానే అప్రదిష్ట తెచ్చారు. విశాఖలో మిలీనియం టవర్స్ పాడుబెట్టారు, 100కుపైగా స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయంటే గత నాలుగేళ్లలో ఏపిలో జరిగిన విధ్వంసం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అధోగతికి దిగజారడం తెలంగాణకు కలిసొచ్చిన అదృష్టమైంది. జగన్మోహన్ రెడ్డి అసమర్ధ, అవినీతి పాలన ఒకరకంగా తెలంగాణకు వరమైంది. ఏపినుంచి పరారైన కంపెనీలను తెలంగాణకు రాబట్టుకోవడంలో అక్కడి పాలకులు కృతకృత్యులైనారు. ఫాక్స్ కాన్ ఎక్సెటెన్షన్, అమర్ రాజా వంటివి వాటిలో కొన్నిమాత్రమే.. ఇంకొన్నింటిని కర్ణాటక, తమిళనాడు ఎగరేసుకెళ్లాయి ..ఎప్పుడైతే ఏపి నుంచి పోటీలేకుండా పోయిందో తెలంగాణ పంట పండింది. అక్కడి మంత్రి కేటిఆర్ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టుకోగలిగాడు. దావోస్ సహా అనేక దేశాల్లో పర్యటించి హైదరాబాద్ కున్న వనరులు వివరించి పారిశ్రామికవేత్తలను మెప్పించగలిగారు.
ఆ చొరవగాని, సామర్ధ్యంగాని ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో, ఇక్కడి మంత్రి గుడివాడ అమర్నాథ్ లో మచ్చుకి కూడా లేకపోవడం ప్రజల ప్రారబ్దమే..పైగా కోడి అని గుడ్డు అని గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు మరింత అభాసు పాల్జేశాయి. ఇప్పుడే కోడి గుడ్డు పెట్టిందని, అది పొదగాలని అప్పటికి గాని పిల్లలు రావని ఏపి మంత్రి అమర్నాథ్ కామెంట్స్ ను సోషల్ మీడియా వైరల్ చేయడం వికటించింది. దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ రెండోస్థానానికి చేరడం, జిఎస్ డిపి గణనీయంగా పెరగడం, జిఎస్ టి వసూళ్లు ఏపికన్నా 40% ఎక్కువకు చేరడం అక్కడి పాలనా సామర్ధ్యం వల్లనెంతోగాని, ఏపిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చేతగానితనంతోనే అనేది అక్షర సత్యం..విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడంలో ఏపి 17వ స్థానానికి దిగజారడం ఘోర వైఫల్యం..
గతంలో మున్నెన్నడూ లేని రీతిలో ఏపిలో కూల్చివేతలు-విధ్వంసాలు, తప్పుడు కేసులు-అక్రమ నిర్బంధాలు, అశాంతి-అభద్రత పేట్రేగిపోవడం ఆంధ్రప్రదేశ్ అంటేనే బేజారెత్తేలా చేశాయి. తెలంగాణ రూ 5లక్షల కోట్ల అప్పులు చేస్తే, ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ 11లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోవడం చూస్తే భవిష్యత్తులో మళ్లీ ఈ రాష్ట్రం కోలుకునేనా అనే సందేహాలు నెలకొన్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది, యువతలో నిరాశా నిస్పృహలు పెరిగాయి. రాజధాని అమరావతిలో రూ 2లక్షల కోట్ల సంపదను నాశనం చేశారు. 3రాజధానుల పేరుతో మూడు ముక్కలాటగా మార్చారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ పూర్తిగా వెనుకబడ్డాయి, 4ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ 40ఏళ్లు వెనక్కిపోయింది. ల్యాండ్-శాండ్, మైన్-వైన్ మాఫియాలకు తోడు గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా పేట్రేగిపోవడంతో ప్రజానీకం బెంబేలెత్తుతోంది. ప్రశ్నించే గొంతును నొక్కేయడం, ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలతో స్వేచ్చా జీవనాన్నే దెబ్బతీశారు, శాంతియుత సహజీవనమే లేకుండా చేశారు. బీసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలపై కనీవినీ ఎరుగని దమనకాండ చోటుచేసుకుంది.
అక్కడ తెలంగాణలో జూన్ 2 ఆవిర్భావ దినోత్సవాలతో హోరెత్తుతుంటే, ఇక్కడ ఏపిలో మాత్రం నిరాశ-నిర్వేదం, స్మశాన వైరాగ్యం తాండవిస్తోంది. దీనికితోడు తెలంగాణ మంత్రుల ఎద్దేవా, ఎగతాళి సీమాంధ్రులకు మింగుడు పడని అంశమే..‘‘ఒక్కసారి రోడ్డుమార్గాన ఏపికి తీసుకెళ్లి చూపిస్తే అక్కడి గుంతలు చూసి తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందిందో వాళ్లే చెబుతారనే’’ కేటిఆర్ వ్యాఖ్యలు, ‘‘అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి ఏపి రైతుల మెడకు ఉరితాళ్లు తగిలించారనే’’ హరీశ్ రావు కామెంట్స్, ‘‘ఏపిలో రోజుకు మూడు నాలుగు గంటలు కూడా కరెంటు ఇవ్వడంలేదని’’ ఎద్దేవా, ‘‘గతంలో ఏపిలో ఎకరం అమ్మితే తెలంగాణలో 4ఎకరాలు వచ్చేదని, ఇప్పుడిక్కడ ఎకరం అమ్మితే ఏపిలో 4ఎకరాలు వస్తాయనే’’ కేసిఆర్ వ్యాఖ్యలు జీర్ణించుకోలేనివే..
ఈ నాలుగేళ్లలో తామేమి కోల్పోయామో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్ధమైందిగాని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లైందని, పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్న ఫలితమిదేననే ఆవేదన సర్వత్రా అందరిలో పెల్లుబుకుతోంది. ఒక విజన్ ఉన్న పాలకుడికి, అది లేని అసమర్ధుడికి ఎంత తేడానో తెలసొచ్చేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది.