మంచు కుటుంబం మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. విష్ణు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ‘జిన్నా’ సినిమా మీద ఈ కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇందులో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లు గా నటించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
గాలి నాగేశ్వరరావు (విష్ణు)కు చిన్నప్పటి నుంచి తనను అలా పిలవడం ఇష్టముండదు. అందుకే జిన్నా అని తనే పెట్టుకుంటాడు. అతని చిన్నప్పటి క్లాస్ మేట్స్ రేణుక, స్వాతి అంటే అతనికి ఇష్టం. కానీ రేణుక చిన్నప్పుడే తన తండ్రితో కలిసి అమెరికా వెళ్లిపోతుంది. జిన్నా మాత్రం పెద్దయ్యాక ఆ ఊరిలో ఓ టెంట్ హైస్ పెట్టుకుంటాడు. అతనికి ఊరు నిండా అప్పులే. రేణుక ఊళ్లో లేదు కాబట్టి స్వాతి (పాయల్ రాజ్ పుత్)తో ప్రేమలో పడతాడు. కానీ రేణుక (సన్నీలియోన్) మళ్లీ ఆ ఊళ్లో అడుగుపెడుతుంది. తన బాబాయి(నరేష్) ఇంటికి చేరి వారి కష్టాలు అన్నీ తీర్చేసి తను జిన్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెబుతుంది. ఆమెను పెళ్లి చేసుకుంటే తమ అప్పులు తీరిపోవడమే కాకుండా సర్పంచ్ గా సెటిల్ అవ్వవచ్చని జిన్నా అనుకుంటాడు. దానికి స్వాతి కూడా అంగీకరిస్తుంది. స్వాతిని ప్రేమించిన జిన్నా.. రేణుకను పెళ్లి చేసుకుంటాడా.. అసలు రేణుకకు అంత డబ్బు ఎలా వచ్చింది.. ఎందుకు జనాలు రేణుకను చూసి భయపడుతుంటారు.. లాంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది.
ఎలా చేశారు? ఎలా తీశారు?
ఈ కథలో అసలు ట్విస్టు రేణుక పాత్రే. ఓ వైపు కామెడీ, మరోవైపు హారర్ ఛాయలతో కథనం సాగుతుంది. ప్రథమార్థం ఓ మాదిరిగా ఉన్నా సెకండాఫ్ ప్రేక్షకుడి ఊహకు అందకుండా దర్శకుడు కథనం నడిపిన తీరు బాగుంది. సంభాషణలు బాగా పేలాయి. చమ్మక్ చంద్ర పంచ్ డైలాగుల కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. తనను ట్రోల్స్ చేస్తున్నారంటూ బయట కామెంట్లు చేసిన విష్ణు అలాంటి డైలాగునే ఇందులో పలికాడు. ఓ సన్నివేశంలో ‘నువ్వు నన్ను ట్రోల్ చేయ్ ఎంజాయ్ చేస్తా.. కానీ మా వాళ్ళ జోలి కొస్తే తోలు తీస్తా’ అంటాడు. మంచు విష్ణు డ్యాన్సులు బాగున్నాయి. గణేష్ ఆచార్య కొరియోగ్రాఫర్ గా పనిచేయడం వల్ల ఆ డ్యాన్సుల్లో గ్రేస్ కనిపించిందేమో. అనూప్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంటుంది. పాయల్ పాత్ర అంతంత మాత్రంగానే సాగినా సన్నీ లియోన్ ను మాత్రం బాగానే ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా చమ్మక్ చంద్రతో సాగిన ఎపిసోడ్స్ అన్నీ బాగా కుదిరాయి. కథకులుగా జి. నాగేశ్వర్ రెడ్డి, కోన వెంకట్, దర్శకుడిగా ఈషాన్ సూర్య మంచి మార్కులు సాధించుకున్నారు.
నటీనటులు : మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిషోర్, సద్దాం, నరేష్, చంద్ర తదితరులు..
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : ఛోటా కె. నాయుడు
నిర్మాత : మంచు విష్ణు, మోహన్ బాబు మంచు
డైరెక్టర్ : సూర్య
ఒక్కమాటలో : వినోదానికే పెద్ద పీట
రేటింగ్ : 2.75/5











