బాలయ్య సినిమా టైటిల్ విషయంలో ఉన్న సస్పెన్స్ వీడిపోయింది. బాలయ్య 107 సినిమా పేరును వీర సింహారెడ్డిగా ఖరారు చేశారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంతకుముందు సమరసంహారెడ్డిగా బాలయ్య చేసిన వీరవిహారాన్ని జనం మరచిపోలేదు. ఈసారి వీరసింహారెడ్డిగా బాలయ్య విజృంభణ కొనసాగబోతోంది. డిసెంబరులో కాకుండా సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా దర్శకుడు మలినేని గోపీచంద్ వెల్లడించారు.
కొండారెడ్డి బురుజుకూ బాలయ్యకూ ఏమిటి సంబంధం అనేది తేలబోతోంది.
ఈ బురుజు వద్ద బాలయ్య కూర్చుని ఉన్న ఫొటోని ఇదివరకే విడుదల చేశారు. ఇప్పటిదాకా అక్కడ ఎన్నో ఫైట్లు చూశాం.. ఈసారి బాలయ్య ఫైటు అక్కడే ఉంటుంది మరి. ఈ సినిమా టైటిల్ ను అక్కడే ఎందుకు విడుదల చేయాలనుకోవడానికి కారణం కూడా ఉండబట్టే దీన్ని వేదికగా చేసుకున్నారు. బాలయ్య స్టామినా ఇప్పుడు మామూలుగా లేదు. ఇటు ఓటీటీ అటు వెండి తెర… రెండింటిలోనూ బాలయ్య హవా సాగుతోంది. గత ఏడాది అఖండతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య మరోసారి సత్తా చాటబోతున్నారు. దర్శకుడు మలినేని గోపీచంద్ క్రాక్ లాంటి హిట్ తో హీట్ మీదున్నాడు. దానికి బాలయ్య తోడైతే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే చాలా లీకులు వచ్చాయి. రెడ్డిగారు,
అన్నగారు, జైబాలయ్య.. లాంటి టైటిల్స్ ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ టైటిల్ లో రెడ్డి, సింహ అనే పదాలు ఉండాల్సిందేనని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఈ పేరు పెట్టారు. అసలు బాలయ్య సినిమాలో కొండారెడ్డి బురుజు దగ్గర ఫైట్ ఉంటే ఆ మజాయే వేరు. గతంలో సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి అనే టైటిల్స్ తో సక్సెస్ అందుకున్నారు కాబట్టి ఈసారి వీరసింహారెడ్డి అనే టైటిల్ పెట్టారు.
మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో శ్రుతి హాసన్ మీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖండలో తమన్ రీరికార్డింగ్ మ్యాజిక్ మరోసారి పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. సినిమా విడుదల డిసెంబరులోనా? సంక్రాంతికా? అన్న సస్పెన్స్ కూడా వీడిపోయింది. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు దర్శకుడు ప్రకటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి వారు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.











