Gowtham Reddy Comments On Fiber Net :
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయడమే లక్ష్యంగా సాగుతున్న వైసీపీ ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్నాయి. వాస్తవంగా ఏదేనీ కేసులో అవినీతి అక్రమాలు నిరూపితమైతే.. వాటికి పాల్పడ్డ నేతలు అరెస్ట్ కాక తప్పదు. అయితే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చిన్న అవినీతి మరక కూడా లేని చంద్రబాబు.. ప్రత్యర్థులు ఎన్నెన్ని కేసులు వేస్తున్నా.. వాటి నుంచి న్యాయ పోరాటంతోనే బయటపడుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే కదా. తన మాదిరే చంద్రబాబు కూడా జైలుకు వెళ్లి వస్తేనే.. తన ఇగో శాటిస్ఫై అవుతుందన్న దిశగా జగన్ కేసుల మీద కేసులు పెట్టేస్తున్నారు.
ఇన్ సైడర్ లో ఏం లేదటగా
అధికారం చేతికందకముందు నుంచే అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పిన జగన్.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవహారంపై ఏకంగా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసుపై చంద్రబాబు కోర్టుకు వెళ్లలేదు గానీ.. ఈ కేసులో జగన్ సర్కారు నిందితులుగా పేర్కొన్న వారు మాత్రం కోర్టు మెట్లెక్కారు. దీనిని పరిశీలించిన హైకోర్టు.. అసలు ఇన్ సైడర్ లో అక్రమాలు జరిగిన దాఖలాలు లేవని, అయినా అక్కడ జరిగినదానికి, ప్రభుత్వం ఆరోపిస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? అంటూ దర్యాప్తును నిలుపుదల చేసింది. హైకోర్టు తీర్పుపై జగన్ సర్కారు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు మాదిరి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.
తెర మీదకు ఫైబర్ నెట్..
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసుతో చంద్రబాబును అరెస్ట్ చేయలేమన్న భావనకు వచ్చారో, లేదో తెలియదు గానీ.. వెంటనే ఫైబర్ నెట్ కేసును ఎత్తుకున్నారు. మొన్నటిదాకా ఈ కేసులో నాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ పై ఆరోపణలు గుప్పించిన వైసీపీ సర్కారు.. ఇప్పుడు ఉన్నపళంగా మాట మార్చేసింది. ఈ దిశగా ఆదివారం మంత్రి మైకపాటి గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏపీ ఫైబర్ నెట్ లో కుంభకోణం జరిగింది. దానిని వెలికి తీస్తున్నాం. సీఐడీ రేపో మాపో పేర్లతో సహా అక్రమార్కుల బండారం బట్టబయలు చేస్తుంది. 2జీ స్పెక్ట్రమ్ తరహాలో చంద్రబాబు అండ్ కో చేసిన అవకతవకలన్నీ బయటికి వస్తాయి. చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదు’’అని గౌతం రెడ్డి తనదైన శైలిలో చెప్పుకుపోయారు.