కాంగ్రెస్ పార్టీలో ఇక ముందు ముందు సమీకరణాలు మారనున్నాయా? పార్టీలో సీనియర్లు అయిన గులాం నబీ అజాద్, కపిల్ సిబాల్ వంటి సీనియర్లను నమ్ముకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులను పార్టీ పక్కనే అవకాశం ఉందా..? నూతన తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో- తన ముగింపు ప్రసంగంలో “అయిపోయిందేదో అయిపోయింది. ఇక ముందు ఇలాంటివేవీ ఉండవు“ అని అన్నారంటే చాలా మార్పులు ఉంటాయని అర్ధం చేసుకోవాలని పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గులాం నబీ అజాద్ తో ఇన్నాళ్లూ మంతనాలు నెరపిన నాయకులకు స్థానచలనం తప్పదంటున్నారు.
గులాం నబీకి అంతో ఇంతో సన్నిహితంగా ఉండే నేతల జాబితాలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చడం ఖాయమని అంటున్నారు. అలాగే ఇక్కడ గులాం మనుషులుగా పేరున్న వారికి భవిష్యత్ లో ఎలాంటి పార్టీ పదవుల పందారంలోనూ స్థానం కల్పించరంటున్నారు. అలాగే ఆంద్రప్రదేశ్ లో కూడా ఆయన మనుషులకు మంగళం పాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
జాతీయ స్థాయిలో కూడా ఏఐసీసీ కార్యవర్గంతో పాటు మిగిలిన అన్ని స్ధాయిల్లోనూ మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సమీకరణల్లో కూడా గులాం నబీ అజాద్ తో పాటు కొందరు సీనియర్లకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్న వారిని పక్కన పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, కేరళతో పాటు తెలంగాణలో కూడా భారీ మార్పులు చేసే అవకాశులన్నాయని పార్టీ సీనియర్ల అభిప్రాయం. ఈ సారి యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించడం ద్వారా సీనియర్ల పని అయిపోయిందనే సంకేతాలు ఇచ్చే అవకాశలున్నాయి.
ఇటీవల మరణించిన పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడి స్ధానాన్ని యువ నాయకత్వంతో భర్తీ చేయాలన్నది సోనియా ఉద్దేశ్యంగా చెబుతున్నారు. అలాగే అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాలలో కూడా భారీ మార్పులు జరుగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ తన సొంత మనుషులతో కోటరీని తయారు చేసుకుని ఇక పాత తరానికి చెక్ పెట్టే అవకాశాలూ ఉన్నాయని చెబుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో గులాం నబీ అజాద్ మనుషులకు పీసీసీల్లో ఎక్కువ పదవులు ఇచ్చారు. ఇప్పుడు వారంతా మాజీలుగా మిగిలుతారు. ఇలా చేయడం ద్వారా తన ఆధిపత్యంతో పాటు తన కుటుంబ ఆధిపతాయన్ని కూడా పార్టీ శ్రేణులకు తెలిసేలా చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పగ్గాలు కుటుంబం నుంచి చేజారకుండా… భవిష్యత్ లో రాహుల్ గాంధీ, ప్రియాంకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే కొటరీని తయారు చేస్తారని కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది.
సీనియర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలకు సోనియా శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీని ఎదుర్కొవడంతో పాటు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం స్థానిక నాయకత్వానికే ఇక ముందు ముందు అన్ని అవకాశాలు ఇస్తారని చెబుతున్నారు.