పాత గొడవల నేపధ్యంలోనే చంద్రయ్య హత్య..!
గ్రామంలో నెలకొన్న పాత కక్షల నేపథ్యంలోనే తోట చంద్రయ్య హత్య జరిగిందని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని వెల్దూర్తి మండలం, గుండ్లపాడులో గురువారం టీడీపీ నేత తోట చంద్రయ్యను వైసీపీ నాయకులు అతి కిరాతంగా కత్తులతో నరికి హతమార్చారు. చంద్రయ్య కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, 24 గంటల్లోనే హత్యకు పాల్పడిన నిందుతులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. నిందులను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశామని చెప్పారు. చంద్రయ్య హత్య చేసిన వారిలో ప్రధాన నిందుతుడు చింత శివరామయ్యతో పాటు చింత ఎలమంద కోటయ్య, సాని రఘురామయ్య, సాని రామకోటేశ్వరరావు, చింత శ్రీనివాసరావు, తోట ఆంజనేయులు, తోట శివనారాయణ, చింత ఆదినారాయణను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విశాల్ గున్నీ మీడియాకు వివరించారు. ప్రధాన నిందితుడు చింత శివరామయ్య, హత్యకు గురైన చంద్రయ్య మధ్య ఉన్న పాత కక్షలు ఉండగా.. గ్రామంలోని సిమెంట్ రోడ్డు విషయంలో వీరిద్దరి మధ్య వివాదం ముదిరి హత్యకు దారితీసిందన్నారు. అన్ని ఆధారాలతో నిందితులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే టీడీపీ నేతలు పెద్దఎత్తున నిరసన తెలియజేసి, ఆందోళనకు దిగారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుండ్లపాడు విచ్చేసి, చంద్రయ్య మృతదేహానికి నివాళులర్పించారు. పాడిపట్టి అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. కుటుంబానికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.