తెలంగాణలో 2023 ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌కు ధీటుగా పోటీ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా ఆ పార్టీలో ఒక ఎంపీ తీరుపై విమర్శలొస్తున్నాయి. ఆయన దూకుడుగా వ్యవహరించడమే కాకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆ స్థాయిలో స్పందించడం లేదంటున్నారు. పార్టీ నేతలంతా అధికార టీఆర్ఎస్ తీరుపై ఒంటి కాలితో లేస్తుంటే కేంద్ర మంత్రి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఆ ఎంపీ అనుచరులు ఆరోపిస్తున్నారు.
నలుగురు ఎంపీలు గెలవగానే ..
నలుగురు ఎంపీలు గెలవగానే బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతోందని భావించారు. అందుకు అనుగుణంగానే చేరికలు సైతం సాగాయి. కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వగానే పార్టీకి ఇక రాష్ట్రంలో తిరుగులేదని ఆ పార్టీ నేతలు భావించారు. పార్టీలో కిషన్‌రెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అంటే పార్టీ నేతలు , కార్యకర్తలకు ఎనలేని గౌరవం. ప్రస్తుతం పార్టీలో ఆయనకు వ్యతిరేక వర్గం తయారయినట్టు కనిపిస్తోంది. మొదటి నుండి పార్టీలో ఉన్నవారు కాకుండా కొత్తగా పార్టీలో చేరిన కొందరు ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్‌కు అనుకూలంగా పోస్టులు పెడుతుండటంతో ఈ అంశాన్ని కిషన్‌రెడ్డి వర్గం సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం.
మెతక వైఖరి ఎందుకు..
అధికార పార్టీపై మాటల దాడి చేయాల్సిన స్టేటస్ ఉండి కూడా కిషన్‌రెడ్డి మెతక వైఖరి అవలంభిస్తున్నారని సోషల్ మీడియాలో డైరెక్ట్‌గా కిషన్‌రెడ్డిపై దాడి చేస్తున్నారు . పార్టీలో చాలా మంది మాటల దాడులు చేస్తుంటే కిషన్‌రెడ్డి మాత్రం ఆ స్థాయిలో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేయడం లేదని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీపై విరుచుకు పడుతూ ఆ పార్టీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగే ఆ ఎంపీ తీరుపై బీజేపీలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్నట్లు వినికిడి. ఆ ఎంపీ వ్యవహారంతో విసిగిన ఆ పార్టీ కేడర్ , కిషన్‌రెడ్డి వర్గం ఇప్పటికైనా అరవింద్ తీరుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. వ్యక్తిగత దూషణలకు దిగుతూ పార్టీ పరువు తీయడమే కాకుండా కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్న ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని దూకుడుకు కళ్ళెం వేయాలన్న డిమాండ్ పార్టీలో పెరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో కేంద్ర మంత్రి, ఎంపీల వివాదం మరింత ముదరక ముందే రాష్ట్ర , జాతీయ నాయకత్వం కలుగజేసుకుని సఖ్యత కుదుర్చాలని , లేదంటే పార్టీ పరువు రోడ్డున పడటం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.