(అమరావతినుంచి లియో న్యూస్ ప్రతినిధి)
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కోల్డ్‌వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో హైకోర్టులో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చింది. నిమ్మగడ్డ కేసుపై హైకోర్టులో వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులకు చేసిన ఖర్చు న్యాయమూర్తులనే నోరెళ్లబెట్టేలా చేసింది. న్యాయమూర్తులకు ఇంత మొత్తం చెల్లిస్తున్నారా? ప్రజల వద్ద నుంచి పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేసిన డబ్బును ఇలా దుబారా చేస్తున్నారా? అంటూ హైకోర్టు న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం హైకోర్టు న్యాయమూర్తే కాదు, ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ కేసులో లాయర్లకు చెల్లించిన మొత్తాలను చూస్తే ఎవరైనా నోరెళ్ల బెట్టాల్సిందే.
నిమ్మగడ్డ పిటిషన్ వల్లే సమాచారం బయటకు వచ్చింది
ప్రభుత్వం తరపున కోర్టుల్లో కేసులు వాదించడానికి న్యాయవాదులను ఆశ్రయించడం సహజం. అయితే వారికి ప్రభుత్వం ఎంత మొత్తం ఫీజుల రూపంలో చెల్లించింది అనేది మాత్రం చాలా సందర్భాల్లో బయటకు రాదు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వం మధ్య నడచిన కేసులో, ఏపీ ప్రభుత్వం న్యాయవాదులకు ఎంత మొత్తం చెల్లించిందో సమాచారం బయటకు వచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. గతంలో నిమ్మగడ్డను తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం, హైకోర్టులో కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు ఒక్కో లాయర్ కు రోజుకు 3.30 లక్షల నుంచి 4.4 లక్షలు దాకా ఫీజుల రూపంలో చెల్లించారు. ఎస్.ఎస్.ప్రసాద్ అనే న్యాయవాది 16 సార్లు కోర్టుకు వచ్చి నందుకు రూ.58.7 లక్షల ఫీజులు చెల్లించారని నిమ్మగడ్డ కోర్టు ముందుంచారు. కానీ నిమ్మగడ్డ తరపున వాదించిన లాయర్ కు ఇవ్వాల్సిన రూ.10.50 లక్షలను చెల్లించడానికి ప్రభుత్వం సుముఖత తెలపలేదని ధర్మాసనం ముందు లెక్కలు ఉంచారు.
నిమ్మగడ్డ పిటిషన్లో న్యాయవాదులకు ప్రభుత్వం చెల్లించిన మొత్తాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన డబ్బును ప్రభుత్వం ఇలా దుర్వినియోగం చేయడం దురదృష్ణకరమని వ్యాఖ్యానించారు. అంటే ప్రభుత్వం న్యాయవాదులకు అఫీషియల్ గా చెల్లించిన ఫీజులు ఎంత భారీగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
అనధికారికంగా ఎంత చెల్లించారో..
ప్రభుత్వం న్యాయవాదులకు కోట్ల రూపాయలను ఫీజుల రూపంలో చెల్లిస్తోంది. అధికారికంగా ఎంత చెల్లించారనేది సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చు. కానీ అనధికారికంగా బ్లాక్ మనీ రూపంలో స్వప్రయోజనాల కోసం న్యాయవాదులకు ఎంత చెల్లిస్తున్నారనేది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదులు, అమరావతి హైకోర్టుకు వచ్చి వాదనలు వినిపించాలంటే ఒక రోజు మొత్తం కేటాయించాల్సి ఉంటుంది. కొందరు సుప్రీంకోర్టులో వాదించే లాయర్లు రోజుకు రూ.14 నుంచి 20 లక్షల దాకా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.
అంత మొత్తం ఎందుకంటే, ఢిల్లీ నుంచి అమరావతి హైకోర్టుకు వస్తే ఒక రోజు మొత్తం కేటాయించాల్సి వస్తోందట. అందుకే ఒక రోజులో సదరు లాయర్ ఎంత మొత్తం సంపాదించగలరో అంత మొత్తం ఫీజు ఒక్క కేసులోనే డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆ న్యాయవాదులు ఢిల్లీ నుంచి అమరావతికి రానుపోను విమానఛార్జీలు, ఫైవ్ స్టార్ హోటల్ గదుల అద్దెను అధనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కలు పరిశీలిస్తే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు చెప్పింది నిజమనిపించేలా ఉంది. ఏపీ ప్రభుత్వం న్యాయవాదులకు ఫీజులు చెల్లించేందుకు బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించుకోవాల్సి వస్తుందన్న ఎంపీ మాటలు అతిశయోక్తి కాకపోవచ్చు.
మనీలాండరింగ్ లో చిక్కుకున్న వైసీపీ ఎంపీ
వారం రోజుల కిందట ఢిల్లీలో ఓ న్యాయవాది ఫీజుగా రూ.217 కోట్లు తీసుకుని ఆదాయపన్ను ఎగవేశారని కేసు నమోదైంది. ఈ కేసులో ఏపీ అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న కీలక నేత చిక్కినట్టు తెలుస్తోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు సదరు ఎంపీ ఢిల్లీలో వారం రోజులుగా తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. మనీలాండరింగ్ పై ఈడీ కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి బయటపడేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజం ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వాలు కోట్ల రూపాయల ప్రజాధనం కేసుల పేరుతో దుబారా చేయడం నిజంగా దురదృష్టకరమే.