ప్రతి ఇంట్లో పొపుల డబ్బాలో తప్పక మెంతులు కనిపిస్తాయి. అయితే చాలామంది ‘ఆ.. మెంతులే కదా..! అని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. ఇక నుంచి అలా అనకండి మరి. ఎందుకంటే మెంతుల్లో బొలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
హెల్త్ బెనిఫుట్స్ ఎన్నో..
మెంతుల్లో పోషకాలు, పీచు పదార్థాలు, ఇనుము, విటమిన్ సి, బి1, బి2, కాల్షియంలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. పొడి చేసుకుని తీసుకున్నా, నానబెట్టి ఆ నీటిని తాగినా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఎక్కువగా ఊరగాయలు, పులుసు, పోపుల్లో వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల అన్నిరకాలుగా మేలు చేస్తుంది.
జుట్టు రాలకుండా..
ఈ రోజుల్లో ప్రతిఒక్కరిని వేధించే సమస్య జుట్టు రాలడం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు జుట్టు రాలడం సాధారణంగా మారింది. జుట్టు రాలడం సమస్యకు మెంతులతో చెక్ పెట్టొచ్చు. మెంతులను నానబెట్టి, ఆ నీటిని జుట్టుకి మసాజ్ చేయండి. దీంతోపాటు మెంతులను పెరుగులో నానబెట్టి మిక్సీపట్టి, తలకి ప్యాక్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు.. రంగు కూడా నెరవకుండా ఉంటుందట.
జీర్ణ సమస్యకు కూడా…
ఆహారపు అలవాట్లో, మరే ఇతర కారణాలో చాలామంది జీర్ణ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటివాళ్లకు మెంతులు బెస్ట్ ఆప్షన్. క్రమం తప్పకుండా మెంతులు వాడితే ఎంతో మేలు చేస్తుంది. ఓ గ్లాస్ నీటిలో టీ స్పూన్ పరిమాణంలో మెంతులను నానబెట్టి వాటిని తాగాలి. జీర్ణసమస్యలు తగ్గుతాయి. ముత్ర సంబంధి, మలబద్ధకం లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుందట.
బాలింతలకు మేలు
బాలింతలు మెంతులను నేరుగా తీసుకున్న, పొడి రూపంలో తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది. మెంతులతో కషాయం చేసుకుని తాగితే బాలింతలకు మేలు చేస్తుంది. ముఖ్యంగా మెంతికూర పప్పు తినిపిస్తే, బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
బరువును తగ్గిస్తుంది
మెంతులను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే బరువు కూడా తగ్గొచ్చట. ఇదే మాట డాక్టర్లతో పాటు, కొన్ని హెల్త్ సర్వేలు కూడా చెప్పాయి. మెంతులతో కలిసిన ఫుడ్ తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది. అలాగే మెంతులతో తయారుచేసిన టీ, మెంతులు కలిపిన నీళ్లను తాగితే కూడా బరువు తగ్గుదలకు పనిచేస్తుంది.