టీడీపీ ఎక్కువ సీట్లు గెలిచిన రెండు మున్సిపాల్టీల్లో ఒకటైన తాడిపత్రి ఛైర్మన్ ఎన్నిక గురువారం జరగనుంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు చేజారకుండా టీడీపీ ప్రయత్నాలు చేస్తుండగా ఎలాగైనా సరే..రెండు ఓట్లు తమకు వస్తే తమకే ఛైర్మన్ గిరీ దక్కుతుందని అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. మొత్తం మీద తాడిపత్రి పురపాలక సంఘ ఛైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
టీడీపీకి మొత్తం 20 మంది కౌన్సిలర్ల మద్దతు
ఈ మున్సిపాల్టీలో మొత్తం 36 స్థానాలున్నాయి. అందులో అధికార వైసీపీ 16 గెలిచింది. తెలుగుదేశం పార్టీ 18గెలవగా సీపీఐ నుంచి ఒకరు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. సీపీఐ నుంచి గెలిచిన అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీకి మొత్తం 20 మంది కౌనెలర్ల మద్దతు లభించింది. అయితే వైసీపీ 16గెలిచినా..ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్యకు ఇక్కడే ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ పార్టీకి ఉండే ఓట్ల సంఖ్య 18కి చేరింది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా.. అందుకు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభ్యంతరం చెప్పారు. రాయదుర్గంలో ఆయన ఓటు ఉందని, అక్కడి నుంచి ఎమ్మెల్సీగా నెగ్గారని ఫిర్యాదు చేయడంతో పాటు మరికొన్ని అభ్యంతరాలు రావడంతో స్థానిక మున్సిపల్ కమిషనర్ దీపక్ రెడ్డి దరఖాస్తును తిరస్కరించారు. ఈ నిర్ణయంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..
ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పవర్ పాలిటిక్స్ ఉంటాయన్న అనుమానంతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులతోపాటు టీడీపీకి మద్దతు పలికిన సీపీఐ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థిని రహస్య క్యాంపునకు తరలించారు. తొలుత హైదరాబాద్‌కి చేర్చి అక్కడ నుంచి బెంగళూరు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. గురువారం ఉదయం డైరెక్ట్‌గా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి తీసుకురానున్నట్లు సమాచారం.
Also Read ;- ఎంపీ Vs ఎమ్మెల్యే.. జంగారెడ్డిగూడెం పీఠానికి వైసీపీలో గ్రూపులు
సీపీఐ విప్ జారీ..
కాగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. అభ్యర్థులు తమ చేజారకుండా చూస్తన్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే స్వతంత్ర అభ్యర్థి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక సీపీఐ నుంచి గెలిచిన అభ్యర్థి విషయంలో ఆ పార్టీ ముందు జాగ్రత్తగా టీడీపీకి మద్దతు పలుకుతున్నట్లు విప్ జారీ చేసింది. ఈ మేరకు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్‌రెడ్డికి ముందుగానే విప్ నోటీసు పత్రం అందజేశారు.
బెదిరింపులు..బందోబస్తు..
కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాడిపత్రి పురపాలక సంఘం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ప్రమాణస్వీకారం ఉన్న నేపథ్యంలో 15మంది సీఐలు, 25 మంది ఎస్ఐలతో పాటు 600 వందల మంది పోలీసులను మోహరించారు. డ్రోన్ కెమెరాలతో భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా తమకు మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ అభ్యర్థులు ఒత్తిళ్లు చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. స్థానిక టాటా మోటార్స్ గ్యారేజ్ ప్రాంతంలో తమ పార్టీ నుంచి గెలిచిన మాజీవలీ కుటుంబానికి వైసీపీ నుంచి బెదిరింపులు వచ్చాయని, అయితే ఇందుకు సదరు గ్యారేజీ నిర్వాహకులు కూడా వ్యతిరేకించడంతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇరుపక్షాలు ఇప్పటికే పరస్పరం పలు ఫిర్యాదులు చేసుకున్నారు. రెండువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
మైనార్టీలకు వైసీపీ గాలం..
తాడిపత్రి మున్సిపాల్టీని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో అన్ని రకాల మార్గాలను వెతుకుతున్న వైసీపీ తాజాగా మైనార్టీలకు గాలం వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాడిపత్రి ఛైర్మన్ పదవి మైనార్టీలకే ఇస్తామని ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం కూడా ఉంది. తాడిపత్రిలో రెండు పార్టీల నుంచి గెలిచినవారిలో 11మంది మైనార్టీలే ఉండడం, అందులో టీడీపీ నుంచి ఐదుగురు ఉండగా, స్వతంత్ర అభ్యర్థికూడా మైనార్టీ వర్గానికి చెందినవారే కావడంతో ఈ ప్రకటన వచ్చిందని చెబుతున్నారు. ఇదే కాకుండా తమకు మద్దతు పలికితే.. భారీ మొత్తంలో నజరానా ఉంటుందని కూడా ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ.40లక్షలకు పైబడి ఈనజరానా ఉంటుందని, ఇప్పటి వరకు ఉన్న కేసుల విషయాన్ని కూడా తామే చూసుకుంటామని, ఎలాంటి ఇబ్బంది ఉండదన్న కోణంలో ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద గురువారం జరిగే ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.
Must Read ;- ఆ రెండూ కూడ వదలం.. మైదుకూరు, తాడిపత్రిల్లో వైసీపీ ‘పవర్ ’పాలిటిక్స్