హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం కురిసింది. దీంతో వాహనదారులు, నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి వరకు నగర వాసులపైన తన ప్రతాపాన్ని చూపెట్టింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఎక్కడి వారు అక్కడే చిక్కుకున్నారు. మొన్న జరిగిన వర్ష బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నగరవాసులకు మరోసారి తన ప్రతాపాన్ని వర్షం చూపించడంతో హైదరాబాద్ పరిస్థితి ఆగమాగమైంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రహదారులపై భారీగా వరదనీరు చేరడంతో మోకాళ్లలోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రహదారులన్నీ జలదిగ్భందం..
ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-బెంగుళూరు హైవేలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పనామా-ఎల్బీనగర్ రోడ్డు ఏకంగా గోదావరినే తలపించింది. ఈప్రాంతంలో కేవలం ఒక గంటలోనే 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెహీదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, బయోడైవర్శిటీ, గచ్చిబౌలి రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి, నార్సింగి, లంగర్‌హైజ్, మెహిదీపట్నం మీదుగా వాహనాలను దారి మళ్లించారు. బాలాపూర్ చెరువు నీళ్లు వీధుల్లోకి వచ్చేశాయి. చాలా ప్రాంతాల్లో చెరువులు ఉప్పొంగడంతో వరదనీరంతా కాలనీల్లోకి చేరింది. పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా బెంగుళూర్ వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు.
కుండపోత వర్షాలు…
బంగాళఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి వానలు దంచికోడుతున్నాయి. దీంతో భారీ వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటి వరకు మొత్తం 11 అల్పపీడన ద్రోణులు ఏర్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, ఖమ్మం, సిద్ధిపేట్ జిల్లాల్లో వర్షాలు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసాయి. మరో రెండు రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
రోడ్డుపైనే ఈత కొట్టాడు..
నిన్న కురిసిన కుండపోత వర్షానికి ఎల్‌బినగర్-వనస్థలిపురం మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ రహదారి చెరువును తలపించింది. దీంతో వనస్థలిపురంలో ఓ వ్యక్తి ఆ వర్షపు నీళ్లలోనే ఈత కొట్టుకుంటూ పోయాడు. దీంతో అక్కడున్న వారు దానిని వీడియో తీయడంతో ఆ విడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.











