భారీ వర్షాలు రైతులను కడగండ్లనే మిగిల్చాయి. రాష్ట్రం వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు రూ.5వేల కోట్లకుపైగా నష్టం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. రూ.1350 కోట్లను పునరావాస చర్యల కోసం కేంద్రం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరావాస చర్యల కోసం రూ.750 కోట్ల సాయం, నష్టపోయిన రైతులకు మరో రూ.600 కోట్లు సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోడీని సిఎం కెసిఆర్ కోరుతూ లేఖ రాశారు. జిహెచ్ఎంసికి తక్షణ సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లను ప్రకటించింది. యుద్ధప్రాతిపదికన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం ఆదేశించారు. భవిష్యత్తులో మళ్లీ వరద ముంపు తలెత్తకుండా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆయన దిశానిర్ధేశం చేశారు.
ఇళ్లు కూలిపోయిన వారికి కొత్త ఇళ్లు..
ఇళ్లు కూలిపోయిన వారికి కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని సిఎం తెలిపారు. అలాగే పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగించాలని, బాధితులకు భోజనం, దుప్పట్లు పంపిణీ చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం వరకు 50 మంది చనిపోయారని అధికారులు సిఎంకు నివేదించారు. దీంతో చనిపోయిన వారి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను సిఎం ప్రకటించారు. 7.35 లక్షల ఎకరాల్లో పంట మునిగిందని అంచనావేశారు. రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీంతో తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సాయం అందించాలని సిఎం కోరారు.
నిభంధనలు కఠినతరం..
బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే ముందు వరద నీరు సెల్లార్లలో చేరకుండా ఉండేలా నిబంధనలు విధించాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో చేరిన నీటిని మోటర్ల సహాయంతో తొలగించిన తరువాతే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. అపార్ట్ మెంట్లలో నిలిచిన నీటిని తొలగించడానికి వాటర్‌బోర్డు, ఫైర్ సర్వీస్ సేవలను ఉపయోగించుకోవాలని సిఎం అధికారులను సూచించారు
రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం…
భారీ వర్షానికి రాష్ట్రవ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. వీటి నష్టం సుమారు రూ.2వేల కోట్ల వరకు ఉంటుంది. వందేళ్ల తరువాత ఒకే రోజు 31 సెం.మీ. వర్షపాతం నమోదవడంతో గురువారం నాటికి వరదలు, వర్షాల కారణంగా 50 మంది మృత్యువాతపడ్డారు. జిహెచ్ఎంసి పరిధిలోనే 11 మంది మరణించారు.
నగరంలోని 20540 ఇళ్లు నీటమునిగాయి. 144 కాలనీలు నీటమునిగాయి. 65 ఇళ్లు పాక్షికంగానూ 14 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 35 వేల కుటుంబాలు వరదల కారణంగా నిర్వాసితులయ్యారు. హైదరాబాద్‌లో సుమారు 72చోట్ల పునరావాస కేంద్రాల ద్వారా 1.10 లక్షల మందికి భోజనం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 30 పట్టణాల్లో వరదల ప్రభావం ఉంది. రాష్ట్ర వ్యాప్తతంగా 101 చెరువల కట్టలు తెగిపోతే, 26 చెరువులను రంధ్రాలు పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మొత్తంగా విద్యుత్ శాఖకు రూ.5కోట్ల మేర నష్టం జరగింది. బీటీ రోడ్లు, 6 చోట్ల జాతీయ రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు సిఎం దృష్టికి తీసుకుళ్లారు.