(విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
దేవస్థాలయం ఆలయ ఛైర్మన్ సంచైత గజపతి తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. పైగా సంస్థకు భారంగా కూడా మారుతున్నాయి. తలచుకున్నది అడ్డగోలుగా.. అనధికారికంగా చేసేయడం, విమర్శలు వస్తే.. వాటికి అధికారిక ముద్ర వేసేయడం సంచైత శైలిగా కనిపిస్తోంది.
తినడానికి తిండి లేదు .. కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఉంది సింహాచలం దేవస్థానం పాలకమండలి తీరు. కరోనా వైరస్ తీవ్రత పెరిగిన దగ్గర నుంచి దేవాదాయ శాఖ ఆదాయం పూర్తిగా పడిపోయింది. మార్చిలో ప్రారంభమైన లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలపాటు దేవాలయాలు మూతపడ్డాయి. దీంతో ఉద్యోగులకు సైతం జీతాలు ఇచ్చే పరిస్థితి చాలా దేవాలయాల్లో కనిపించడం లేదు.
6a టెంపుల్ కేటగిరీకి లో ఉన్న సింహాచలం దేవస్థానం ఉద్యోగులకు గత కొంతకాలంగా 50 శాతం జీతం మాత్రమే చేతికి అందుతోంది. హుండీ ఆదాయం పూర్తిగా పడిపోవడంతో ఆ 50% జీతాల కోసం అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు దేవాదాయశాఖ అష్ట కష్టాలు పడుతోంది. ఇదిలా ఉండగా గురువారం సమావేశమైన సింహాచల దేవస్థానం పాలకమండలి ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు ఆదేశాల మేరకు.. ఓ ఎస్ డి పోస్టును సృష్టించి, నెలకు 50 వేల రూపాయలు జీతం కట్టబెట్టేందుకు తీర్మానించింది. అంతేకాదు.. భోజన, వసతి, రవాణా సౌకర్యాలు సైతం కల్పించనుంది. శతాబ్దాల చరిత్ర ఉన్న దేవస్థానంలో… దశాబ్దాల కాలం నుంచి చైర్మన్ వ్యవస్థ నడుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ ఎస్ డి పోస్టు సృష్టించారు. ఆయన గారి విధివిధానాలు ఏంటో కూడా స్పష్టత లేదు.
ప్రస్తుతం ఓఎస్డీగా నియమించుకోవాలి అనుకుంటున్న వ్యక్తి గత మూడు నెలల కాలంగా సింహాచలం దేవస్థానం కొండపైన కాలక్షేపం చేస్తున్నారు. దేవస్థానం కాటేజ్ లో మూడు పూటలా తిండి ఇతర సౌకర్యాలు కల్పించి దేవస్థానానికి సంబంధించిన రికార్డులు పరిశీలన బాధ్యత కూడా అనధికారికంగా ఎప్పటి నుంచో ఒలకబోస్తున్నారు. దానిపై దుమారం దుమారం రేగడంతో పాలకమండలి సమావేశంలో అధికారికంగా ఓ ఎస్ డి పోస్ట్ ను సృష్టించారు. ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు వంటి ప్రముఖ వ్యక్తులు దేవస్థానం చైర్మన్లుగా పదవిని ఎన్నో ఏళ్ల పాటు అలంకరించారు. వారి హయాంలో లేనే హంగు, ఆర్భాటం ప్రస్తుత చైర్పర్సన్ చూపుతున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయాలను బట్టి లేని అధికారాలను సైతం సొంతం చేసుకుని వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ప్రత్యేక ఆసక్తితో నియమించిన ఓఎస్డి విధివిధానాలపై ఒక క్లారిటీ వస్తే దీనిపైనా దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.











