ఏప్రిల్ 13 ఉగాది నాటికి రాజధాని విశాఖకు తరలుతుందని వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించిన రెండు రోజులకే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాలుగు నెలల్లో రాజధాని విశాఖకు తరలిపోతుందని ఆయన ఇవాళ వెలగపూడిలో ప్రకటించారు. అమరావతి రాజధానిపై 93 పిటిషన్లను హైకోర్టు విచారిస్తోంది. హైకోర్టు సీజే కూడా మారిపోవడంతో విశాఖ తరలింపునకు అనుకూలంగా తీర్పు వస్తుందనే ఉద్దేశంతోనే వైసీపీ అగ్రనేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే హైకోర్టు ఎస్‌ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ను కూడా నిలిపి వేసింది. ఇక హైకోర్టులో వైసీపీ నేతలకు అనుకూలంగా తీర్పులు వస్తాయనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయని ప్రతి పక్షాలు అనుమానిస్తున్నాయి.
అమరావతిలో నాలుగు నెలలే…
ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 13 నాటికి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. కోర్టు తీర్పు వెలువడిన రోజే సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కృష్ణా బోర్డు కార్యాలయం కూడా విశాఖలో పెట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆర్టీసీ పరిపాలనా భవనాన్ని విశాఖలోని ద్వారకా బస్టాండ్ నాలుగో ప్లోరులో పెట్టేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు కూడా రాజధాని తరలింపు వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
Must Read ;- నెంబరు 2 కోసం.. విజయసాయి vs సజ్జల