తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అధిష్టానం సవాల్ విసిరింది. త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే పదవుల పందారానికి గీటురాయిగా స్పష్టం చేసింది. పీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న సీనియర్లు ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయాన్ని అందించి ఆ తర్వాత పదవులు పొందాలని ఆంక్షలు విధించినట్లు సమాచారం. ప్రస్తుత తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ పదవి నుంచి తప్పించాలని అధిష్టానం భావిస్తోంది.
అయితే ఆ పదవిలో ఎవరిని కూర్చోపెట్టాలా అని కాంగ్రెస్ పెద్దలు కొంతకాలంగా యోచిస్తున్నారు. ఈ పదవి కోసం సీనియర్లు వి.హనుమంతరావుతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు సభ్యుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎంత డబ్బు అయినా తానే సొంతంగా ఖర్చు చేస్తానని కూడా ప్రకటించారు.
ఇక జగ్గారెడ్డి అయితే పార్టీని పటిష్టపరచడం కోసం తన దగ్గర అనేకానేక వ్యూహాలున్నాయని, తనకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టపెట్టాలంటూ చాలాకాలంగా కోరుతున్నారు. ఇక మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి అయితే కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఉన్న తనకే ఈ పీసీసీ పదవి కావాలంటూ ఏకంగా సోనియాగాంధీకే విన్నవించుకున్నారు.
బీసీలకే ఇవ్వాలంటున్న హనుమన్న…
నేరుగా తనకు పదవి కావాలని స్పష్టంగా అడగక పోయినప్పటికీ.. బీసీలకు ఈసారి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలంటూ సీనియర్ నాయకుడు వీ.హనుమంతరావు అధిష్టానం వద్ద వాపోయారు. తాను పార్టీలో సీనియర్ నాయకుడినని, పైగా గతంలో పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా సమర్ధవంతంగా బాధ్యతలు చేపట్టానని కూడా చెబుతున్నారు.
ఇక దళిత వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ అయితే ఏకంగా పార్టీ సుప్రీం రాహుల్ గాంధీ అండదండలు కోరుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ ప్రసంగానికి తెలుగులో అనువాదం చేసి ఆయన అభిమానం పొందిన దాసోజు శ్రవణ్ జాతీయ అధికార ప్రతినిధి పదవి పొందారు. ఇప్పుడు దాసోజు కూడా పీసీసీ రేసులో ఉన్నారు.
గెలిచి రండి… చూద్దాం…
తెలంగాణ సీనియర్ నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూంటే అధిష్టానం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు, పీసీసీ పీఠానికి ముడిపెడుతోంది. నాయకులు వారి సమర్థతను పటిమను నిరూపించుకోడానికి అదొక్కటే కొలబద్ధ అని భావిస్తోంది. త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలంగాణా రాష్ట్ర సమితితో పాటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎలాగైనా ఎక్కువ స్ధానాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి.
ఎక్కడక్కడే పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడం, వారితో సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ తరుణంలో పీసీపీ పీఠంపై కూర్చోవాలనుకునే వారు తమ తమ జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని, ఆ విజయాన్ని అధిష్టానానికి బహుమతిగా ఇస్తే వారికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టపెడతామని షరతు విధించినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్లంతా చెమటోడ్చేందుకు సిద్ధమవుతున్నారు.











