(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
కరోనా తో సహజీవనం చేయమని జగన్ పిలుపు ఇచ్చారు గానీ.. ప్రజలు దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. కానీ.. ఏదో వాళ్లంతట వాళ్లు ప్రాణ భయంతో మాస్కులు వాడడమూ గట్రా అలవాటు చేసుకుని, ఎలాగోలా బతుకులీడుస్తున్నారు. ఎవరి జాగ్రత్తల్లో వాళ్లుంటున్నారు గానీ.. సీఎం సాక్షాత్తూ.. మాస్కులు తీసేసి ఫోటోలకు ఫోజులివ్వమనడం, కరోనా జాగ్రత్తలకు భిన్నంగా వ్యవహరించడం ఇదంతా చిత్రంగా కనిపిస్తోంది. ప్రజలకు మాత్రం తప్పుడు సంకేతాలు ఇచ్చేలాగానే కనిపిస్తోంది.
గరుడసేవకు తిరుమలేశునికి పట్టువస్త్రాలు ఇవ్వడానికి సీఎం జగన్ బుధవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తన కుమార్తె పవిత్ర తో కలిసి వచ్చి సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధు, ఆయన కుమార్తె సీఎం తో కలిసి ఫోటో కూడా దిగారు. వారు చాలా పద్ధతిగా మాస్కులు ధరించి.. సీఎం సముఖానికి వచ్చారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కాస్త దూరంగానే మెలిగారు.
ఫోటో దిగే సందర్భంలోనూ మాస్కులతోనే నిల్చుంటే.. జగన్ ప్రత్యేకించి.. మాస్కుల్ని తీసేయండి.. అని చెప్పి వారితో తీయించేసి మరీ ఫోటోలకు పోజులివ్వడం చూసేవాళ్లకు చిత్రంగా కనిపించింది.
ఈ రోజుల్లో నాయకులే.. తమ వద్దకు వచ్చే ప్రతివారినీ.. మాస్కులు తప్పనిసరిగా ధరించమని హెచ్చరిస్తున్నారు. అలాంటిది జగన్, మాస్కలతో వచ్చిన వాళ్లని అవి తీసేయమని తనే చెప్పి మరీ ఫోటోలు దిగడం చిత్రమైన సంగతి.
కరోనా సీజన్లో ప్రజల్లో తిరుగుతూ.. వారికి సరుకులు పంపిణీ చేస్తూ చాలా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే మధుసూదన రెడ్డికి గతంలో కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆ నేపథ్యంలో ఆయన జాగ్రత్తగా ఉన్నా.. జగన్ మాస్కులు తీసేయించడం.. తప్పు- ఒప్పు- అనే చర్చ కాదు గానీ.. ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతుంది?











