కరోనా ఫస్ట్ వేవ్ సీనియర్ సిటిజన్స్ ను ముప్పుతిప్పలు పెట్టింది. సెకండ్ వేవ్ ఉక్కునరల్లాంటి యువతపై ఎదురుదాడి చేసింది. ఇప్పుడు మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందనే సందేహాలు అంతటా వినిపిస్తున్నాయి. కరోనా మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపినా.. చూపకున్నా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను మానసికంగా సిద్ధం చేయాల్సిందేనని అంటున్నారు డాక్టర్లు. పిల్లలకు కరోనా వస్తే ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి, హోం ఐసోలేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలపై కచ్చితంగా అవగాహాన ఉండాలి.
పెద్దలతో పోలిస్తే…
ఇప్పటివరకు పెద్దలతో పోలిస్తే కరోనా బారిన పడ్డ పిల్లల సంఖ్య చాలా తక్కువేనని చెప్పాలి. జలుబు, దగ్గు లాంటి సమస్యలతో బాధపడినా.. మరణాలు అంతంతమాత్రంగా జరిగాయి. కొవిడ్ ప్రభావం పిల్లలపై చాలా తక్కువగా ఉంటందట. పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకినా.. వ్యాధి బారిన పడటం అనేది తక్కువే. థర్డ్ వేవ్ ముప్పు పిల్లలపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
హోం ఐసోలేషన్ జాగ్రత్తలు
కరోనా సమయంలో పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో.. పిల్లలు కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మాస్కులు ధరించడం, భౌతిక పాటించడం లాంటివి పిల్లలకు విధిగా అలవాటు చేయాలి. ఒకవేళ పిల్లలకు కరోనా సోకితే తల్లిదండ్రులు కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు కాబట్టి వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. ఎలాంటి సందేహాలు లేకుండా పిల్లలకు సాయం చేయొచ్చు. మాస్కులు ధరించి.. సోషల్ డిస్టన్స్ పాటించి, చేతులు శుభ్రం చేసుకుంటూ పిల్లలకు అవసరమైనవి అందించవచ్చు. కరోనా బారిన పడ్డ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దలు (అమ్మమ్మ, తాతయ్య) దగ్గర విడిచిపెట్టకూడదు. ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. ఒక ప్రత్యేకమైన గదిని కేటాయించి, పిల్లలకు కావాల్సినవి ఏర్పాటు చేయాలి. డాక్టర్ల సూచనను బట్టి కనీసం 10 నుంచి 20 రోజుల వరకు ఐసోలేట్ చేయాలి. వ్యక్తిగత శుభ్రత నేర్పించాలి. పిల్లలు త్వరగా కోలుకునేందుకు డ్రైఫ్రూట్స్, తగిన మోతాదులో మాంసాహారం, పండ్ల రసాలు అందించాలి. కరోనా నివారణలో వ్యాక్సిన్ కీలకంగా పనిచేసింది కాబట్టి పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ చేయించాలి. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ పిల్లలు తీసుకుంటున్నారు. పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. వెంటనే తీసుకోవడం మంచిది.











