రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రాజకీయాలు మాజీ ప్రధాని పివి నరసింహారావు చుట్టూనే తిరిగుతున్నాయి. ఒక సారి మనం పరిశీలిస్తే పివికి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎంఐఎం వ్యతిరేకించిన విషయం చూశాం. అలాగే ఇప్పుడు బండి సంజయ్ కూడా తన పెద్దపల్లి పర్యటనలో పివి నరసింహారావు పేరు కేంద్రంగానే టిఆర్ఎస్ అధినేత కెసిఆర్‌పై విరుచుకుపడ్డారు.
పివి నరసింహారావు పేరును వాడుకొని కేసిఆర్ దేశ రాజకీయాల్లో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. పివి నరసింహా రావు పేరును వాడుకొని దేశ రాజకీయాల్లో కెసిఆర్ వెళ్లడమనేది అర్ధరహితమైన ఆరోపణని టిఆర్ఎస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు. బిజెపి పార్టీకి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇతర ఏ ప్రజా సమస్యే దొరకలేదన్నట్లుగా కేవలం ఒక తెలంగాణ విమోచన దినోత్సవం అంశంపైనే మాట్లాడుతున్నరనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రజా సమస్యలన్నీ పక్కన పడేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ విమోచన దినోత్సవంపైనే మాట్లాడటం తప్పితే అనేక ఇతర ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడటంలేదనే ప్రశ్నలు ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. విమోచన దినాన్ని జరపాలనే డిమాండును ఒక వర్గం వారంతా కోరుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ఇంకా ఏ ఇతర సమస్యలు పట్టనట్లుగా బిజెపి ఈ ఒక్క అంశాన్ని లేవనెత్తుతూ ఆ వర్గానికి సంబంధించిన వారిని తమవైపు తిప్పుకునేందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన ఒక జాతీయ పార్టీగా రాష్ట్రంలోని ప్రజా సమస్యలపైన పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
పీవీ మీద మీ ముద్ర అనవసరం
తెలంగాణ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామం నుండి దేశ ప్రధానిగా ఎదిగి ప్రజలకు సేవలందించిన పివి నరసింహారావును పార్టీలకు అతీతంగా అందరూ చూడాల్సి ఉంటుంది. ఆయన ఏ పార్టీకి చెందినవారూ..అని కాకుండా కేవలం తెలంగాణ ప్రాంతం వాడిగా మాత్రమే చూడాలని అంటున్నారు. పివికి పార్టీల రంగును పులుమొద్దని పివి అభిమానులు పేర్కొంటున్నారు. పివికి భారతరత్న ఇవ్వాలనే అంశాలను రాజకీయ అంశంగా చూడొద్దని చెప్తున్నారు.
పివికి భారతరత్న ఇవ్వాలని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాన్ని తప్పుపట్టడం బిజెపి పార్టీకి సరైంది కాదని అంటున్నారు. ఎందుకంటే పివికి భారత రత్న ఇవ్వాలని టిఆర్ఎస్ పార్టీ కేంద్రాన్ని విజ్ఞప్తిచేయడం తప్పైతే.. సర్ధార్ వల్లభాయ్ పటేల్ పేరును బిజెపి కీర్తించడం కూడా రాజకీయ ఎత్తుగడే అనుకోవాలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ నాయకుడు కాకున్న ఒక ప్రాంత వాడిగా, దేశానికి ఎంతో సేవ చేసినందుకుగానూ ఎలాగైతే సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ను గౌరవించారో అలాగే పివి నరసింహారావును కూడా భారత రత్నతో గౌరవించాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు.
అసలు ముందుగాల బిజెపి రాష్ట్ర పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేసేలా తమ ఉద్యమ పంథాను మార్చుకోవాలని సూచిస్తున్నారు. కేవలం విమోచన దిననంపైనే మాట్లడటం తప్పితే ఇతర ప్రజా సమస్యలపై ప్రశ్నించకపోవడాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనను బిజెపి సమర్థించినట్లుగా చూడాల్సి అవసరం ఉందని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.











