సాధారణంగా టాప్ హీరోలు ఎంత వయసొచ్చినప్పటికీ.. హీరోలుగానే కొనసాగుతూ.. కుర్ర హీరోయిన్స్ తో సైతం జోడీ కట్టడం క్వైట్ కామన్. కానీ హీరోయిన్స్ అలా కాదు .. ఏజ్ మీద పడేకొద్దీ టాప్ హీరోలతో చిందులేసే అవకాశం కోల్పోతారు. టాలీవుడ్ , కోలీవుడ్ లో ఆ తరహా కథానాయికలు చాలా మంది కనిపిస్తారు. అయితే నిన్నటి తరం కథానాయిక మీనా మాత్రం .. దానికి తాను మినహాయింపని నిరూపిస్తోంది. ప్రస్తుతం మీనా తెలుగు, తమిళ , మలయాళ, భాషల్లో సైతం టాప్ హీరోల సరసన కథానాయికగా నటిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
1989 లో నవయుగం తో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీఇచ్చింది మీనా. ఆ తర్వాత వరుసగా అన్ని భాషల్లోనూ అప్పటి అగ్ర కథానాయకులతో జోడీ కట్టింది. అలాగే బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పటి వరకూ మీనా సినిమాలు మానకుండా.. ఏదో ఒక లాంగ్వేజ్ లో ప్రధాన పాత్రల్లో నటిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ఈ జెనరేషన్ లో కూడా పలువురు టాప్ స్టార్స్ సరసన కథానాయికగా నటించే అవకాశం అందుకుంది. ప్రస్తుతం ముగ్గురు టాప్ స్టార్స్ తో మీనా ఏకకాలంలో నటిస్తూ షాకిస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి కలయికలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ పున: ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘డేంజర్, మోనార్క్, టార్చ్ బేరర్’ లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. అలాగే. ఇందులో బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్నాడని, అందులో ఒకటి అఘోరా అని తెలిసిందే. ఆ పాత్ర కు జోడీగానే మీనాను ఎంపికచేశారని , ఆమె కూడా ఆ పాత్రపై ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. సింహ, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్టయిన నేపథ్యంలో బాలయ్య, బోయపాటి కలయికలో వస్తోన్న ఈ మూడో సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్వకత్వంలో ‘అన్నాత్తే’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందు సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమా .. త్వరలోనే తిరిగి చిత్రీకరణ జరుపుకోనుంది. ఇక ఇందులో రజనీ సరసన మీనా కథానాయికగా నటిస్తున్నట్టు వార్తలొచ్చాయి .అలాగే.. ఖుష్బూ కూడా మరో కీలకమైన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. అలాగే కీర్తి సురేశ్ కూడా నటిస్తోంది. గతంలో రజనీకాంత్, మీనా జంటగా పలు సూపర్ హిట్టు మూవీస్ వచ్చాయి. ఈ సినిమా కూడా వీరిద్దరి జోడీ అభిమానుల్ని అలరిస్తుందని చెబుతున్నారు.
మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమా దృశ్యంలో మీనా కథానాయిక గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే.. దాని తెలుగు వెర్షన్ లో వెంకీ సరసన కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రానుంది. మొదటి భాగం తీసిన దర్శకుడు జీతూ జోసెఫే ఈ సినిమానీ తెరకెక్కిస్తున్నాడు. మొన్నామధ్య అనౌన్స్ మెంట్ జరుపుకున్న దృశ్యం 2 సినిమా త్వరలోనే లాంచ్ కానుంది. ఈ మధ్య వరుసగా మలయాళంలోనే సినిమాలు చేస్తున్న మీనా.. ఈ సినిమాతో కూడా మంచి క్రేజ్ తెచ్చుకోడానికి ప్రయత్నిస్తోంది. సో… ఈ వయసులో కూడా వరుసగా సీనియర్స్ తో నటిస్తున్న మీనా.. ఈ మూడు సినిమాలతో ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటుందో చూడాలి.