మహానటి సావిత్రి తర్వాత ఆ జనరేషన్ లో సినీ రంగాన్ని ఏలిన అగ్రతార జమున కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. మొదట్లో నాటక రంగంలో ఉన్న ఆమె ఆ తర్వాత సినీ రంగంలోకి పుట్టిల్లు చిత్రంతో అడుగుపెట్టారు. గరికపాటి రాజారావు ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. అప్పటికి ఆమె వయసు 16 సంవత్సరాలే. కర్ణాటకలోని హంపిలో ఆమె పుట్టినా ఆ తర్వాత గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో పెరిగారు. అదే ఊరికి చెందిన నటుడు జగ్గయ్య ఆమెను నాటక రంగానికి పరిచయం చేశారు. ఖిల్జీ రాజ్య పతనం ఆమె నటించిన తొలి నాటకం. జమున నటించిన తొలి చిత్రం పుట్టిల్లు నుంచే హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూడా చిత్ర రంగానికి పరిచయమయ్యారు.
1950 వ దశకం తర్వాత వచ్చిన అగ్రహీరోలందరి సరసనా జమున నటించారు. ముఖ్యంగా సత్యభామ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. మొదటిసారిగా వినాయక విజయంలో ఆమె సత్యభామ పాత్ర పోషించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారంలో నటించారు. అందులో ఎన్టీఆర్ ను ఆమె కాలితో తన్నే సన్నివేశాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. 1936 ఆగస్టు 30న జమున జన్మించారు. మహానటి సావిత్రి కూడా అదే సంవత్సరం జన్మించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరూ ఒకే వయసు వారు. నటి సావిత్రితో కలిసి ఢీ అంటే ఢీ అనేలా నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు అనేకం ఉన్నాయి. మిస్సమ్మ, గుండమ్మ కథ, మూగమనసులు లాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి.
సినిమాల్లోకి రాకముందు నుంచే వీరిద్దరి మధ్యా స్నేహం ఉండేది. నటుడు హరనాథ్ తో ఆమె ఎక్కువ చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ ఆమె నటించారు. ఆమె నటించిన సినిమాల సంఖ్య దాదాపు 200 పైచిలుకే. మిస్సమ్య సినిమా ఆమె కెరీర్ లోనే మైలు రాయిగా చెప్పాలి. 2008లో ఆమెకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం లభించింది. 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా జమునకు ఫిల్మ్ ఫేర్‌అవార్డులు అందుకున్నారు. అలాగే ఆమె రాజకీయంగానూ ఓ వెలుగు వెలిగారు. 1989లో రాజమండ్రి స్థానం నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు. ఒకదశలో ఎన్టీఆర్ మీద కూడా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు. ఆమె భర్త రమణారావు 2014లో కన్నుమూశారు. వీరి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ప్రస్తుతం హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. జమున మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెప్పాలి.