గ్రేటర్ ఎన్నికల పోరు ఎంత రసవత్తరంగా సాగిందో దానికి భిన్నంగా పోలింగ్ మందకోడిగా సాగుతోంది. గడపదాటి ఓటు వేయడానికి నగర ఓటరు బద్దకిస్తున్నాడు. దీంతో పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకైనా పోలింగ్ 30 శాతానికి దాటని పరిస్థితి ఉంది. సినీనటులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం క్యూలైన్‌లో నిలబడి మరీ ఓటు వేశారు.
క్యూలో నిల్చున్న హీరోలు…
-మెగాస్టార్ చిరంజీవి దంపతులు జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-సినీ హీరో విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
-కాచిగూడలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్రహోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి.
-సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ఓటు హక్కును కేపీహెచ్‌బీ కాలనీ ఏడవ ఫేజ్‌లో వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు తాను అరుకు నుంచి వచ్చానని.. బాధ్యతతో ఓటు వేసేందుకు అందరూ రావాలని ఆయన పిలుపునిచ్చారు.
-ప్రజాగాయకుడు, యుద్ధనౌక గద్దర్ ఓటు హక్కును అల్వాల్ వెంకటాపురం 135 డివిజన్ మహాబోధి స్కూల్‌లో వేశారు. నవభారతాన్ని నిర్మించాలంటే యువకులు ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
-తెలంగాణ మంత్రి కేటీఆర్ సతీసమేతంగా బంజారాహల్స్ నందినగర్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి కాషాయ రంగు మాస్కుతో ఆమె పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచి వాళ్లను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
-ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఆయన సతీమణి అమల ఇద్దరూ కలిసి వచ్చి జూబ్లీహిల్స్ ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
-మారేడ్‌పల్లిలోని కస్తూర్బా గాంధీ కాలేజీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
-హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కుషాయిగూడలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
-తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ అజంపూరాలో ఓటు వేశారు.
-డీజీపీ మహేందర్‌రెడ్డి దంపతులు కుందన్‌బాగ్‌లో ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ప్రజలందరూ ధైర్యంగా ఓటును వినియోగించుకోవాలని సూచించారు.
-సినీ దర్శకుడు తేజ జూబ్లీహిల్స్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ పార్థసారథి తన ఓటు హక్కును బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లో వేశారు.
-ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును శాస్త్రీపురలో వేశారు.ఈయన పోలింగ్ కేంద్రానికి బైక్‌పై వచ్చారు.
-ఫిల్మ్‌నగర్ క్లబ్‌లోని పోలింగ్ కేంద్రంలో సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-సైబరాబాద్ సీపీ సజ్జనార్ నాంపల్లిలోని వ్యాయామశాల హైస్కూల్ కేంద్రంలో ఓటు వేశారు.
-అంబర్‌పేట ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఓటు వేయగా, కుందన్‌బాగ్ చిన్మయి స్కూల్‌లో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఓటు వేశారు.
ఇలా మరికొంత మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read: హైదరాబాద్ మేయర్ రేసులో మంత్రుల కోడళ్లు, కూతుళ్లు!











